కాంగ్రెస్ సీనియర్ నేత జితేంద్ర ప్రసాద బీజేపీలో చేరిక 

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. సీనియ‌ర్ నేత‌, మాజీ కేంద్ర మంత్రి జితిన్ ప్ర‌సాద కాంగ్రెస్ పార్టీని వీడి కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ స‌మ‌క్షంలో బుధ‌వారం బీజేపీలో చేరారు. రెండు సార్లు ఎంపీగా ప‌నిచేసిన జితిన్ ప్ర‌సాద‌ రాహుల్ గాంధీకి స‌న్నిహితుడిగా పేరొందారు. 

యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు ఆయ‌న కాంగ్రెస్ పార్టీని వీడ‌టం ఆ పార్టీకి ఎదురుదెబ్బ‌గా పరిశీల‌కులు భావిస్తున్నారు. జితిన్ ప్ర‌సాద చేరిక‌ను బీజేపీ అధికారికంగా ప్ర‌క‌టించింది. గ‌తంలో జ్యోతిరాదిత్య సింధియా, హిమంత బిశ్వ శ‌ర్మ వంటి కీల‌క నేత‌ల‌ను దూరం చేసుకున్న కాంగ్రెస్ పార్టీని తాజాగా యూపీ రాజ‌కీయాల్లో కీల‌క నేత జితిన్ ప్ర‌సాద వీడటం ఆ పార్టీ వ‌ర్గాల్లో నైరాశ్యం అలుముకుంది.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన జితేంద్ర ప్రసాద తనయుడే జితిన్. 2001లో యూత్ కాంగ్రెస్‌లో చేరిన జితిన్ 2004 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని షాజహాన్‌పూర్‌ నుంచి పోటీ చేశారు.  వరుసగా రెండు పర్యాయాలు గెలుపొంది, ఆ తర్వాత వరుసగా రెండు సార్లు ఓటమి చెందారు. 

ఆయన తండ్రి జితేంద్ర ప్రసాద రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియా గాంధీపై పోటీ చేశారు. అయితే ఆ తర్వాత జితిన్ ప్రసాదను ఆమె స్వయంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు వచ్చారు.  యూపిఏ హయాంలో మన్మోహన్ కేబినెట్‌లో యువ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీతో తనకు మూడు తరాల అనుబంధం ఉందని, బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని, మిగతా వన్నీ ప్రాంతీయ పార్టీలేనని జితిన్ ప్రసాద బీజేపీలో చేరాక విలేకరులతో  తెలిపారు. 

బీజేపీలో చేరిన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను జితిన్ ప్రసాద  కలిశారు. తన ప్రజలకు, సమాజానికి సేవ చేయలేకపోతున్నానని తాను భావించి బీజేపీలో చేరినట్లు ఆ తర్వాత మీడియాకు తెలిపారు. బీజేపీలో చేరడంతో తన రాజకీయ జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభమైందని చెప్పారు.

సంస్థాగతంగా జాతీయ పార్టీగా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీయే ఉందని, మిగిలిన పార్టీలు వ్యక్తి ప్రాధాన్యంగలవని, లేదంటే, ప్రాంతీయ స్వభావంగలవని చెప్పారు. కాంగ్రెస్‌ను వీడటానికి కారణాలను వివరిస్తూ, ఎవరైనా తన ప్రజల ప్రయోజనాలను కాపాడలేకపోతే, వారికి సేవ చేయలేకపోతే, ఆ పార్టీని వీడటమే శ్రేయస్కరమని తాను భావించానని పేర్కొన్నారు. బీజేపీలో ఉంటూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తాను తన ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతానని భావించినట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు కోరుతూ సోనియా గాంధీకి గత ఏడాది లేఖ వరసైన 23 మంది సీనియర్ పార్టీ నాయకులలో ఆయన కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆ లేఖను సరిగ్గా వ్రాయలేదని అంటూ, తాను ఎల్లప్పుడూ సోనియాగాంధీకి విధేయుడినై ఉంటానని మాటమార్చారు. ఆ తర్వాత ఆయనను పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా చేశారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆ రాష్ట్రంలో కాంగ్రస్ ఒక సీట్ ను కూడా గెల్చుకోలేక పోయింది.