హుజూరాబాద్‌ ఉప ఎన్నిక మరో కురుక్షేత్ర సంగ్రామం 

హుజూరాబాద్‌లో జరిగే ఉప ఎన్నికల సంగ్రామం కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలా ఉంటుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే ఈ సంగ్రామంలో తప్పకుండా ధర్మానిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. 

‘ఆనాడు తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌ కేంద్ర బిందువైతే.. ఆ కరీంనగర్‌ను కాపాడుకున్న నియోజకవర్గం ఆనాటి కమలాపూర్, ఈనాటి హుజూరాబాద్‌. ఇవాళ ఆత్మగౌరవం, అణ గారిన వర్గాల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోస మే కాకుండా అణచివేత నుంచి ప్రజల్ని ముందుకు నడిపించడం కోసం హుజూరాబాదే గొప్ప ఉద్యమ క్షేత్రంగా మారి మరో ఉద్యమానికి నాంది పలకబో తోంది..’ అని ప్రకటించారు. 

ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించాక తొలిసారి ఆయన హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని స్వగ్రామమైన కమలాపూర్‌కు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అయన బీజేపీలో చేరే ముందు రెండు రోజుల పాటు తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 20 ఏళ్లపాటు ఉద్యమ జెండా ఎత్తి భంగపడి, అవమానాలకు గురైనవారు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు హుజూరాబాద్‌లో జరిగే కురుక్షేత్రానికి తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు తొత్తులుగా మారిపోయి ఇవాళ తమ నాయకులు, ప్రజలపై అవాకులుచవాకులు పేలుస్తున్నారని ఈటల మండిపడ్డారు. ‘వారందరికీ ఇదే హెచ్చరిక.. మీరు వాళ్లిచ్చిన రాతలు పట్టుకుని మా మీద నిందలు వేస్తే, మా ప్రజలను అవమానిస్తే రాజకీయంగా బొంద పెట్టడం ఖాయం’అని హెచ్చరించారు

ఆత్మగౌరవ పోరాటానికి, అణగారిన ప్రజల హక్కుల కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడాని, అణిచివేత నుంచి ప్రజలను ముందుకు నడపడానికి హుజూరాబాదే గొప్ప ఉద్యమం క్షేత్రంగా ఉంటుందని, మరో ఉద్యమానికి నాంది పలుకుతుందని చెప్పారు. ఎప్పటికైనా తానే నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని, కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని పేర్కొన్నారు. 

అధికార పార్టీ నాయకులు అక్రమంగా డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, నాయకులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. డబ్బులతో కొంతమంది నాయకులను కొనుగోలు చేస్తారేమో గానీ, ప్రజలను కొనుగోలు చేయలేరని ఆయన స్పష్టం చేసారు. 

‘బిడ్డా.. నీకు అన్యాయం జరిగింది. 20 ఏళ్ల పాటు గులాబీ జెండాను, తెలంగాణ ఉద్యమాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నావు.. ఇవాళ తెలంగాణకు మోసం చేసిన వాళ్లను పక్కన పెట్టుకుని కష్టకాలంలో అండగా ఉండి ఉద్యమాన్ని నడిపిన నీలాంటి వాడికి ద్రోహం చేయడం కేసీఆర్‌కు తగదు. రేపు నీ రాజీనామా తర్వాత వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు తప్పకుండా బుద్ధి చెప్పి తీరుతామంటూ ప్రజలు నాకు అండగా నిలుస్తున్నారు’ అని ఈటల భరోసా వ్యక్తం చేశారు.