ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు 

ఖరీఫ్ కాలానికి సంబంధించిన పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నువ్వుల మద్దతు ధర క్వింటాల్‌కు రూ 452  పెంచామని, మినుములు క్వింటాలుకు రూ 300 కు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని జవదేకర్ తెలిపారు. 
 
బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ… వరి మద్దతు ధరను కూడా పెంచామని తెలిపారు. గతంలోరూ  1,868 ఉండగా, ఈ ఖరీఫ్ కాలానికి గాను రూ 1,940 కు పెంచుతూ నిర్ణయం తీసుకుని పేర్కొన్నారు. ఇక జొన్నలు, ఇతర తృణధాన్యాల కనీస మద్దతు ధరను కూడా పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 
మరోవైపు రైల్వే సిగ్నల్స్ వ్యవస్థ ఆధునికీకరణ విషయంలో కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 5 జీ స్ప్రెక్ట్రమ్ అమలు కోసం రూ 25,000 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో ఈ పనులు పూర్తి కావాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు.  
 
రైల్వేలకు 700 మెగాహెర్జ్ట్ బ్యాండ్‌ లో ఐదు మెగాహెర్జ్ట్ స్ప్రెక్టమ్‌ను అందిస్తామని, దీని ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థ బాగుపడుతుందని తెలిపారు. ప్రస్తుతం రైల్వే వ్యవస్థలో ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని, దీని స్థానే స్ప్రెక్టమ్ వాడితే రేడియో కమ్యూనికేషన్ చాలా మెరుగుపడుతుందని జవదేకర్ తెలిపారు.
 
ఇక పట్టణాల్లో 3.61 లక్షల గృహాల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. 2021 సంవత్సరానికిగాను 100 రోజుల ఛాలెంజ్‌ పేరుతో రాష్ట్రాలకు పీఎంఏవై-యూ అవార్డులు కేంద్రం ప్రధానం చేయనుంది. ఇక ఇప్పటివరకు మంజూరు చేసిన 1.12 కోట్ల గృహాలలో 82.5 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నట్టు వెల్లడించింది.