కరొనతో అనాథలైన 30 వేల మంది చిన్నారులు 

కొవిడ్19 మహమ్మారి వల్ల దేశంలో ఇప్పటివరకు 30,071మంది చిన్నారులు అనాథలుగా మారారని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్) తెలిపింది. రాష్ట్రాల వారీగా గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 5 వరకు డేటాను సేకరించి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.

అనాథలుగా మారిన చిన్నారుల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. 30,071మందిలో 26,176మంది చిన్నారులు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోగా, 3621 మంది ఇద్దరినీ కోల్పోయారని, 274 మంది అపహరణకు గురయ్యారని ఎన్‌సిపిసిఆర్ పేర్కొన్నది. కొవిడ్ ప్రభావం మహారాష్ట్రపై అధికంగా చూపింది. ఆ రాష్ట్రంలో 7084 మంది అనాథలుగా మారగా, వారిలో 6865మంది తల్లిదండ్రుల్లో ఒకరిని, 217మంది ఇద్దరినీ కోల్పోయారు. మరో ఇద్దరు అపహరణకు గురయ్యారు. 

మధ్యప్రదేశ్‌లో అపహరణకు గురైన చిన్నారుల సంఖ్య 226 అని నివేదిక వెల్లడించింది. రాష్ట్రాలవారీగా అనాథలైనవారు ఉత్తర్‌ప్రదేశ్‌లో 3172, రాజస్థాన్‌లో 2482, హర్యానాలో 2438, మధ్యప్రదేశ్‌లో 2243, ఆంధ్రప్రదేశ్‌లో 2089, కేరళలో 2002, బీహార్‌లో 1634, ఒడిషాలో 1073మంది ఉన్నారు.

దేశంలో అనాథలైన వారిలో 15,620 మంది బాలురు కాగా, 14,447మంది బాలికలు, నలుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని ఎన్‌సిపిసిఆర్ పేర్కొన్నది. వీరిలో 8-13 ఏళ్ల వయసు వారు 11,815 మంది, 03 ఏళ్ల వయసు వారు 2902 మంది, 47 ఏళ్ల వయసు వారు 5107 మంది, 14-15 ఏళ్ల వయసువారు 4908 మంది, 16-18 ఏళ్ల వయసు వారు 5339మంది ఉన్నారు. 

అనాథలుగా మారిన చిన్నారుల డేటాను బహిర్గతం చేయొద్దని రాష్ట్రాలను ఆదేశించినట్టు ఎన్‌సిపిసిఆర్ తెలిపింది. డేటా లీక్ చేయడం వల్ల అనాథలు అపహరణకు, చట్ట విరుద్ధ దత్తతకు గురయ్యే అవకాశమున్నదని తెలిపింది. జువెనైల్ జస్టిస్ ఫండ్ పేరుతో దాతల నుంచి విరాళాల సేకరణ కోసం బ్యాంక్ అకౌంట్‌ను తెరిచి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్రాలను ఎన్‌సిపిసిఆర్ ఆదేశించింది. 

ఇలా ఉండగా, పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పథకం విధివిధానాలు ఇంకా సిద్ధం కాలేదని, చర్చలు జరుగుతున్నాయని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. విధివిధానాలను కోర్టుకు తెలియజేయడానికి కొంత సమయం కావాలని కోరింది. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లల సంరక్షణకు కేంద్రం పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పథకాన్ని ప్రకటించింది. కరోనా కారణంగా ఎంతమంది పిల్లలు అనాథలు అయ్యారన్న విషయంపై జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) ఆరా తీస్తున్నది. దీనికి పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ సహకారం అందించడం లేదని, అనాథ పిల్లలపై సమాచారం ఇవ్వడం లేదని కమిషన్‌ తెలిపింది.