కేరళ బిజెపి ప్రక్షాళనకు ప్రధాని కసరత్తు!

కేరళ అసెంబ్లీ ఎన్నికలలో ఆశించిన ఫలితాలు రాకపోవడం, ఉన్న ఒక్క సీట్ ను కూడా కోల్పోవడం, `మెట్రో మ్యాన్’  శ్రీధరన్ అనూహ్యంగా ఓటమి చెందడం వంటి పరిణామాల పట్ల బిజెపి అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటు రాష్ట్రంలోని పార్టీ నేతల మధ్య సయోధ్య సరిగ్గా లేకపోవడం ఒక కారణంగా భావిస్తున్నారు. 

పైగా, ఈ మధ్య హవాలా మనీ రాకెట్‌ కేసులో పలువురు బిజెపి నాయకులను కేరళ పోలీసులు ప్రశ్నిస్తూ ఉండడం, ఎన్నికల ముందు జరిగిన హైవే దోపిడీలో కోల్పోయిన రూ 3.5 కోట్లు బిజెపి ఎన్నికల నిధిగా కేరళ పోలీసులు ఆరోపణలు చేస్తూ ఉండడంతో రాష్ట్రంలో పార్టీ ప్రతిషకు భంగం ఏర్పడినట్లు ఆందోళన చెందుతున్నారు. 

ఈ పరిస్థితులలో కేరళలో పార్టీ ప్రక్షాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగిన్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల నిధుల పంపిణి గురించి తీవ్ర ఆరోపణలు తలెత్తడంతో,  పార్టీ అధిష్ఠానంతో సంబంధం లేకుండా ప్రధాని, హోమ్ మంత్రి అమిత్ షా కలసి ముగ్గురు సభ్యుల ఒక కమిటీ ఏర్పాటు చేసిన్నట్లు తెలుస్తున్నది.

స్వతంత్ర వ్యక్తులుగా, నిజాయతీ పరులుగా పేరున్న బిజెపి సభ్యులైన మాజీ ప్రభుత్వ అధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రధాని స్వయంగా ఒక రాష్ట్ర బిజెపి వ్యవహారాలపై ఈ విధమైన కమిటీ వేయడం అసాధారణంగా పరిశీలకులు భావిస్తున్నారు.

మాజీ ఐఎఎస్ అధికారి సివి ఆనంద బోస్, మాజీ ఐపీఎస్ అధికారి జాకబ్ థామస్, ఇ శ్రీధరన్ సభ్యులుగా గల ఈ కమిటీ పార్టీ నాయకులను, ఎన్నికలలో పోటీ చేసిన వారిని కలిసి ఎన్నికల సందర్భంగా జరిగిన పార్టీ నిధుల పంపిణి గురించి సవివరంగా దర్యాప్తు జరిపింది. ఒక సమగ్రమైన నివేదికను వీరు ప్రధాని, అమిత్ షా లకు అందించారని చెబుతున్నారు. వీరిలో థామస్, శ్రీధరన్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులుగా పోటీ చేశారు. 

మరో వంక, పార్టీ రాజ్యసభ సభ్యుడు సురేష్ గోపి నుండి రాష్ట్రంలో పార్టీ నాయకుల మధ్య గల విబేధాలు ఏ విధంగా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయో ఒక నివేదిక ఇవ్వమని కోరిన్నట్లు తెలిసింది. 

హవాలా మనీ రాకెట్‌ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలను ప్రశ్నించిన సిట్‌ పోలీసులు ఈ కేసులో కీలకంగా భావిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ కుమారుడు హరిక్రిష్ణన్‌ను ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే బిజెపి రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి జి.గిరీష్‌, ప్రధాన కార్యదర్శి ఎం.గణేష్‌ను విచారించారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌ 3న కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు త్రిసూర్‌ సమీపంలోని కొడకర హైవేపై దాదాపు రూ.3.5 కోట్ల మేర డబ్బు దోపిడీకి గురైంది. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత 7వ తేదీన షంజీర్‌ షంషుద్దీన్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. 

అనంతరం దీనిపై పోలీసులు దృష్టి సారించారు. ఏప్రిల్‌ 6వ తేదీన జరగునున్న ఎన్నికలకు సంబంధించి ఓట్లు కొనుగోలు చేసేందుకు ఈ డబ్బును బిజెపి హవాలా మార్గం ద్వారా తరలించే ప్రయత్నం చేశాయని సిపిఎం, కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు గుప్పించారు. వాస్తవాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ కేసు కేరళలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం కోసం ప్రయత్నిస్తున్న బిజెపికి అప్రదిష్ట తీసుకు వచ్చిన్నట్లు ఆ పార్టీ నాయకులు ఆందోళలన వ్యక్తం చెందుతున్నారు. 

ఆదివారం నాడు జరిగిన పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరం ఈ విషయమై బిజెపిని అప్రదిష్ఠకు గురిచేసేందుకు సిపిఎం, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ ను లక్ష్యంగా చేసుకొని అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం కలసి దాడులు చేస్తున్నామని ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా అరెస్ట్ అయినా సిపిఎం కార్యకర్తల వివరాలను పోలీసులు ఎందుకని  బైట పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేసిన 21 మందిలో కొందరికి సిపిఎం, సిపిఐ లతో సంబంధం ఉన్నట్లు బిజెపి ఆరోపిస్తున్నది. కేరళలోని మొత్తం 140 సీట్లలో 113 సీట్లలో పోటీ చేసిన బిజెపి ఒక్క సీట్ ను కూడా గెల్చుకోలేక పోవడమే కన్నా కేవలం 12 శాతం ఓట్లు మాత్రమే పొందింది. 2016లో వచ్చిన 14. 96 శాతం, 2019 లోక్ సభ ఎన్నికలలో వచ్చిన 14.88 ఓట్ల కన్నా తక్కువగా రావడం గమనార్హం.