ఆరోగ్యశ్రీలో కరోనాను చేరుస్తామని స్వయంగా రాష్ట్ర శాసనసభలో ప్రకటించి, మాట తప్పిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇప్పుడు మొత్తం ఈ పథకాన్నే నిర్వీర్యం చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సాధారణ జబ్బులకు సహితం వర్తింపని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ కింద అత్యవసర చికిత్సకు ప్రైవేట్ హాస్పిటళ్లు అంగీకరించడం లేదు. ముఖ్యంగా కీలకమైన హుద్రోగా సర్జరీలకు ఒప్పుకోవడం లేదు. కరోనా సమయంలో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని, ప్రభుత్వం కూడా సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని సాకులు చెబుతూ, డబ్బులు కడ్తేనే చేర్చుకొంటామని స్ఫష్టం చేస్తున్నాయి.
ఈ విషయంలో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలు అప్పుసప్పు చేసి ఆపరేషన్లు చేయించుకుంటున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 78 లక్షలకుపైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీ స్కీం పరిధిలో ఉన్నాయి. మరో 18 లక్షల ఫ్యామిలీలు తెల్ల రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని ఎదురుచూస్తున్నాయి. వారందరికీ కార్డులు మంజూరు చేస్తే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందే కుటుంబాల సంఖ్య 96 లక్షలకు చేరుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 337 హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్లో ఉన్నాయి. ఈ స్కీం కింద 972 రకాల ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కవర్ అవుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం కరోనా ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.
కొవిడ్ సంగతి పక్కనపెడితే ఇన్నాళ్లూ ఆరోగ్య శ్రీ కింద చేసిన అనేక చికిత్సలను కూడా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటళ్లు నిరాకరిస్తున్నాయి. సర్కారు నుంచి తమకు సకాలంలో డబ్బులు రావడం లేదని, అదీగాక కరోనా టైం కావడంతో తాము రిస్క్ తీసుకోలేమంటున్నాయి. ప్రభుత్వం నుంచి రూ.500 కోట్ల దాక ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు వాపోస్తున్నాయి.
ఆరోగ్యశ్రీ కింద చేయాల్సిన అత్యవసర వైద్య సేవలను కూడా ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ తిరస్కరిస్తున్నాయి. బెడ్లన్నీ కొవిడ్ పేషెంట్లతో ఫుల్ అయ్యాయని, తప్పనిసరి అయితే డబ్బులు కడ్తేనే వైద్యం చేస్తామని అంటున్నాయి. తమ చికిత్స ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతుంది కదా? ఫ్రీగా ఎందుకు చెయ్యరు? అని ఎవరైనా ప్రశ్నిస్తే, కరోనా టైంలో ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని స్పష్టం చేస్తున్నారు.
ఏదైనా ఎమర్జెన్సీ గానీ, జనరల్ సర్జరీ, ఇతర ట్రీట్మెంట్కోసం ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్కు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది ముందుగా పేషెంట్ డిటైల్స్ను ఆరోగ్య శ్రీ ట్రస్టుకు పంపిస్తున్నారు. కానీ అక్కడి నుంచి అప్రూవల్ రావడానికి రోజులకు రోజులు పడుతోంది. సకాలంలో అప్రూవల్ కాకపోవడంతో ఎమర్జెన్సీ ఉన్నవారు, ప్రాణాలు కాపాడుకునేందుకు ఆరోగ్యశ్రీపై ఆశలు వదిలేసుకుంటున్నారు.
ఇదే అదనుగా మేనేజ్మెంట్లు కూడా ‘ఆరోగ్యశ్రీ కోసం చూస్తే మీ ప్రాణాలకు ప్రమాదం.. డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేయించుకోండి..’ అంటూ చేర్చుకొంటున్నాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో సామాన్యులు డబ్బులు కట్టి చికిత్స చేయించుకోక తప్పడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా ఆసుపత్రులు హెల్త్కార్డులను ఒప్పుకోవడం లేదు. ఒకవేళ చేసినా సదరు సర్జరీలకు సంబంధించిన బిల్లులను పెట్టుకుంటే రీయంబర్స్ మెంట్ కింద ఏడాది అయినా క్లైం కావడం లేదని వాపోతున్నారు.
More Stories
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!