వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ ప్రతిపాదనకు భారత్ తీవ్ర వ్యతిరేకత 

వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ జారీ చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను భార‌త్ తీవ్రంగా వ్య‌తిరేకించింది. శుక్ర‌వారం జ‌రిగిన‌ జీ-7 దేశాల ఆరోగ్య మంత్రుల స‌ద‌స్సులో భార‌త్ త‌ర‌ఫున ఆతిధ్య హోదాలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మాట్లాడుతూ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ అంటే అత్యంత వివ‌క్షా పూరిత‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

సంప‌న్న దేశాల‌తో పోలిస్తే, అభివ్రుద్ధి చెందుతున్న‌ దేశాలు వ్యాక్సిన్ల పంపిణీ, స‌ర‌ఫ‌రా, రవాణా, వ్యాక్సిన్ల సామ‌ర్థ్యం అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయ‌ని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ గుర్తు చేశారు. ఈ ప‌రిస్థితుల్లో వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ ప్ర‌తిపాద‌న తేవ‌డం అంటే వ‌ర్ధ‌మాన దేశాల ప‌ట్ల వివ‌క్ష ప్ర‌ద‌ర్శించ‌డ‌మేన‌ని తేల్చి చెప్పారు.

మ‌న‌దేశంలోనూ ఇప్ప‌టివ‌ర‌కు మూడు శాతం జ‌నాభాకు మాత్ర‌మే వ్యాక్సినేష‌న్ పూర్తయింది. వ్యాక్సిన్ల కొర‌త‌తోపాటు అభివ్రుద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సినేష‌న్ నెమ్మ‌దిగా సాగుతున్న‌ది. మున్ముందు ముంచుకొచ్చే మ‌హ‌మ్మారుల‌ను ఉమ్మ‌డిగా ఎదుర్కోవాల‌ని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ పిలుపునిచ్చారు.

అయితే, పేద‌, అభివ్రుద్ధి చెందుతున్న దేశాల‌కు టీకాల పంపిణీపై ఈ స‌ద‌స్సు ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు. అన్ని దేశాల‌కు స‌మానంగా టీకాల పంపిణీపై కొత్త నిర్ణ‌యాలు తీసుకోలేదు.

క‌రోనా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో ఒక దేశం నుంచి మ‌రో దేశానికి ప్ర‌యాణించాలంటే వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ జారీ చేయాల‌న్న ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. టీకా వేయించుకున్న‌ట్లు ప్ర‌భుత్వ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం సంబంధిత యాప్‌లో ఉంటుంది. దాన్ని బ‌ట్టి ఇత‌ర దేశాల‌కు అనుమ‌తించే విధాన‌మే వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌.