టిఎంసి ప్రధాన కార్యదర్శిగా మమతా మేనల్లుడు!

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్‌ బెనర్జీకి పార్టీలో కీలక పదవి కట్టబెట్టారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ శనివారం కోల్‌కతాలో జరిగిన సీనియర్‌ నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

బెంగాల్ ఎన్నికల్లో పార్టీ గెలుపులో అభిషేక్‌ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను నియమించుకొనిఎం  ఆయనతో పార్టీని సమన్వయపరచడంలో అభిషేక్‌ కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు. సంస్థాగతంగా పార్టీని బలపరచడం, ఎన్నికల మేనేజ్‌మెంట్ లాంటి ప్రక్రియలను చాలా సమర్థవంతంగా పోషించారు. 

ప్రధాన కార్యదర్శి పదవి వరించడంతో పార్టీలో అభిషేక్‌ బెనర్జీ ప్రాబల్యం మరింత పెరగనుంది. మమతకు రాజకీయ వారసుడిగా పార్టీలో నిర్ణయాత్మక శక్తిగా మెరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది. వాస్తవానికి అభిషేక్‌కు పార్టీలో ప్రాధాన్యం పెరగడాన్ని జీర్ణించుకోలేకనే ఎన్నికలకు ముందు మమత కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న సువేందు అధికారి సహా మరికొంత మంది కీలక నేతలు పార్టీని వీడి బీజేపీ లో చేరారు.

ఇప్పటి వరకూ అభిషేక్ బెనర్జీ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ బాధ్యతలను మమత తాజాగా నటుడు సాయోని ఘోష్‌కు అప్పజెప్పారు. ఇక మహిళా విభాగం బాధ్యతలను ఎంపీ కకోలీ ఘోష్‌కు అప్పజెప్పారు.

‘‘అభిషేక్ బెనర్జీ మమతా బెనర్జీ అల్లుడు. యువజన విభాగాన్ని చూసుకునేవారు. ప్రస్తుతం ఈయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీఎం మమత నియమించారు. ప్రస్తుతం ఆయన యువజన విభాగం బాధ్యతలు చూస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ రావడంతో అభిషేక్ ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతారు. ‘ఒకే వ్యక్తి- ఒకే పదవి’ అన్న సూత్రంతో ముందుకు సాగాలని నిశ్చయించుకున్నాం. అందుకే అభిషేక్‌ను యువజన విభాగం బాధ్యతల నుంచి తప్పించి, పార్టీ ప్రధాన  కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పాం’’ అని పార్టీ నేత పార్థా ఛటర్జీ ప్రకటించారు.