పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి భారత్ ఆదర్శం

పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి భారత దేశం ఆదర్శంగా నిలుస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడచిన ఏడు సంవత్సరాల్లో భారత దేశ పునరుద్ధరణీయ ఇంధన సామర్థ్యం 250 శాతం కన్నా ఎక్కువకు పెరిగిందన్నారు. శనివారం  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర చమురు, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ; కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మోదీ మాట్లాడారు.

పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో ప్రపంచం ముందు భారత దేశం ఓ ఉదాహరణగా నిలుస్తోందని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించే సమయంలో అభివృద్ధి పనులను నిలిపేయవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ ఒకదానితో మరొకటి కలిసి ప్రయాణించగలవన్నారు. సామరస్యంగా ముందుకు వెళ్ళగలవని చెప్పారు. 

భారత దేశం ఈ మార్గాన్నే ఎంపిక చేసుకుందని పేర్కొన్నారు. 21వ శతాబ్దపు భారత దేశం 21వ శతాబ్దపు  ఆధునిక ఆలోచనలు, ఆధునిక విధానాల ద్వారా మాత్రమే ఇంధనాన్ని పొందుతుందని చెప్పారు. తన ప్రభుత్వం ప్రతి రంగంలోనూ ఈ ఆలోచనా విధానాలతోనే విధాన నిర్ణయాలను తీసుకుంటోందని  వివరించారు. 

భారత దేశం గొప్ప గ్లోబల్ విజన్‌తో ముందుకు వెళ్తోందన్నారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్, ‘ఒన్ సన్, ఒన్ వరల్డ్, ఒన్ గ్రిడ్’ను సాకారం చేయడం, విపత్తుల నుంచి కోలుకునే సామర్థ్యంగల మౌలిక సదుపాయాలను వృద్ధి చేసుకోవడం కోసం కూటమిగా ఏర్పడటం వంటి వాటిలో గ్లోబల్ విజన్‌తో భారత దేశం వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్ళ గురించి భారత దేశానికి తెలుసునని చెప్పారు. ఈ సవాళ్ళ పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా, 2020-25 కోసం రోడ్ మ్యాప్‌పై నిపుణుల కమిటీ నివేదికను మోదీ ఆవిష్కరించారు. ఇథనాల్ ఉత్పత్తి, దేశవ్యాప్తంగా పంపిణీకి సంబంధించిన ఈ-100 పైలట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ పైలట్ ప్రాజెక్టును పుణేలో ప్రారంభించారు.