మోహన్ భగవత్, వెంకయ్య నాయుడు ట్విట్టర్ ఖాతాల బ్లూటిక్‌ తొలగింపు 

గ‌త ఆరు నెల‌లుగా అన్ వెరిఫయింగ్ ఇన్ యాక్టివ్‌గా ఉన్న ఖాతాల‌కు మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్ట‌ర్ బ్లూ టిక్ తొల‌గించింది. ఈ క్ర‌మంలో ఆరెస్సెస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు త‌దితరుల ఖాతాల బ్లూ టిక్‌ను తొల‌గిస్తున్న‌ట్లు తెలిపింది. దీనిపై నెటిజన్లు   తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, త‌ర్వాత ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య ఖాతా బ్లూటిక్‌ను పున‌రుద్ధ‌రించింది. ట్విటర్‌ వినియోగదారు పేరు  మార్చినా లేదా ఖాతా యాక్టివ్‌గా లేకపోయినా ఎలాంటి నోటీసు లేకుండా ఎప్పుడైనా  ‘ధృవీకరించబడిన’ బ్లూ బ్యాడ్జ్ చిహ్నాన్ని తొలగిస్తామని ట్విటర్‌ తెలిపింది.

మోహ‌న్ భ‌గ‌వ‌త్‌తోపాటు ఆరెస్సెస్ సహా సర్ కార్యవాహలు అరుణ్ కుమార్‌, సురేశ్ సోనీ, మాజీ సర్ కార్యవాహ సురేష్ జోషి, ఇతరుల   ఖాతాల బ్లూ టిక్‌ను కూడా తొల‌గించింది. ఇప్పటికే కొత్త ఐటి నిబంధనల అమలుపై కేంద్ర ప్రభుత్వంకు, ట్విట్టర్ కు మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈ చర్య తీవ్ర ఆగ్రవేశాలు కలిగిస్తున్నది.

అందుకు ప్రతిగా కేంద్రం ట్విట్టర్ పై తగు చర్య తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్ స్థానంలో స్వదేశీ అప్ ఒకటి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. `భారత్ లో ట్విట్టర్ ను నిషేధించాలి’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నైజీరియా ట్విట్టర్ ను నిషేధించిన మొదటి దేశం కావడం విశేషం. తమ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ బుహారీ ఖాతాను నిలిపివేసిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు.

ఉపరాష్ట్రపతి కార్యాలయం నుండి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొన్ని గంటల్లోనే దాన్ని పునరుద్ధరించింది. దీనిపై ఎలక్ట్రానిక్స్‌, ఐటి మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌కు నోటీసులిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ఇటువంటి చర్యలు చేపట్టడాన్ని తప్పుపట్టింది. ఇది రాజ్యాంగ పదవిని ధిక్కరించడమేనని, భారత్‌ సహనాన్ని ట్విట్టర్‌ పరీక్షించాలనుకుంటుందని శాఖ పేర్కొన్నట్లు సమాచారం.

కాగా, జులై 2020 నుండి ఆయన వ్యక్తిగత ఖాతా ఉపయోగంలో లేకపోవడంతో వెరిఫైడ్‌ ఖాతాను తీసివేసినట్లు ట్విట్టర్‌ పేర్కొంది. ట్విట్టర్‌ వెరిఫికేషన్‌ పాలసీని బట్టి ఖాతా నిరుపయోగంలో ఉన్న, అసంపూర్తిగా ఉంటే వెరిఫైడ్‌ బ్యాడ్జీని తొలగించవచ్చు. ఇప్పుడు ఆయన ఖాతాను పునరుద్ధరించామని తెలిపింది. ఆరు నెలలకొకసారైనా అకౌంట్‌ను తెరవాలని, అప్పుడే వినియోగంలో ఉన్నట్లని పేర్కొంది.

అయినప్పటికి రాజ్యాంగ పరంగా దేశంలో రెండవ పౌరుడైన ఉపరాష్ట్రపతి పట్ల ఇలా వ్యవహరించడం దారుణమని కేంద్రం పేర్కొంది. మాజీ కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్‌ మరణించినప్పటికీ..వారి ఖాతాలు వెరిఫైడ్‌లో ఉన్నాయని పేర్కొంది. ఆయన రాజకీయాలకు అతీతమైన పదవిలో కొనసాగుతున్నారని, ఇదే రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్న అమెరికా నేతల పట్ల ట్విట్టర్‌ ఇలానే వ్యవహరిస్తోందా అని ప్రశ్నించింది.

ఉపరాష్ట్రపతి ట్విటర్ హ్యాండిల్ నుండి బ్లూ బ్యాడ్జ్ తొలగించడంపై బీజేపీ ముంబై అధికార ప్రతినిధి సురేష్ నఖువా గ  ట్విటర్‌ వేదికగా ఆగ్రహం  వ్యక్తం చేశారు.  ‘భారత రాజ్యాంగంపై దాడి’ అని  వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి జూలై 23, 2020 న పోస్ట్ చేసిన చివరి ట్వీట్‌ చేయగా, సుమారు 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, వైస్ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాకు 931,000 మందికి పైగా అనుచరులున్నారు.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రకటించిన కొత్త ఐటీ నిబంధనలకు సంబంధించి  ట్విటర్‌కు కేంద్రానికి మధ్య  వివాదం నడుస్తోంది. ఇటీవల ఈ వార్‌  మరింత ముదిరిన సంగతి తెలిసిందే. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ట్విట్ట‌ర్ ఖాతా బ్లూ టిక్‌ను త‌ర్వాత పున‌రుద్ధ‌రించినా, ఆరెస్సెస్ నేత‌ల ఖాతాల‌ను ఇంకా పున‌రుద్ధ‌రించాల్సి ఉంది. దీనిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.  

మరోవంక, ట్విట‌ర్‌కు చివ‌రిసారి, క‌ఠిన‌మైన హెచ్చ‌రిక‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. కొత్త ఐటీ నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని, లేదంటే చ‌ట్ట‌ప‌ర‌మైన ప‌ర్య‌వ‌సానాల‌ను ఎదుర్కోవాల్సిందేన‌ని ఐటీ మంత్రిత్వ శాఖ ప్యానెల్ స్ప‌ష్టం చేసిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఐటీకి చెందిన సీనియ‌ర్ అధికారుల‌తో కేంద్ర ఎల‌క్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖా మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ శుక్ర‌వారం ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు ఆ వ‌ర్గాలు తెలిపాయి.

కొత్త మ‌ధ్య‌వ‌ర్తిత్వ మార్గ‌ద‌ర్శ‌క నిబంధ‌న‌లు గ‌త నెల 26 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. అంత‌కుముందు వీటిని అంగీక‌రించ‌డానికి సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం మూడు నెల‌ల స‌మ‌యం ఇచ్చింది. అయితే ట్విట‌ర్ మాత్రం వీటికి ఇంకా అంగీక‌రించ‌లేదు. ఇండియాలో చీఫ్ కాంప్ల‌యెన్స్ ఆఫీస‌ర్, నోడ‌ల్ కాంటాక్ట్ ప‌ర్స‌న్ గ్రీవియెన్స్ ఆఫీస‌ర్ల‌ను ట్విట‌ర్ ఇంకా నియ‌మించ‌లేదని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.