రాహుల్ క్షేత్ర స్థాయిలో పనిచేయాలి… బిజెపి హితవు 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆన్‌లైన్‌లో మాట్లాడటం కాకుండా క్షేత్ర స్థాయిలో పని చేయాలని బీజేపీ హితవు పలికింది. బీజేపీ నేతలు ట్విటర్‌లో బ్లూటిక్ కోసం పోరాడుతున్నారని ఆయన చేసిన ఆరోపణలపై ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఘాటుగా స్పందించారు. 

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి కుంభకోణాల గురించి ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ట్విటర్‌లో రాజకీయాలు చేయడమే రాహుల్ గాంధీకి అత్యంత ముఖ్యమైన విషయమని ఎద్దేవా చేశారు. ఆయనకు ట్విటరే అతి పెద్ద వేదిక అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడాలని, కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి గురించి ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోందని చెబుతూ, పేద ప్రజలకు ఉచితంగా రేషన్ సరుకులు అందజేస్తోందని చెప్పారు.

కాగా, వెరిఫైడ్ అకౌంట్లకు గుర్తుగా బ్లూ టిక్‌ను సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌  పెడుతుంది. ఇటీవల ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ తదితర నేతల ట్విటర్ అకౌంట్లకు బ్లూ టిక్‌ను తొలగించి, కాసేపటి తర్వాత పునరుద్ధరించింది. 

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆదివారం ట్విటర్ వేదికగా కోవిడ్-19 వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న సమయంలో బీజేపీ నేతలు ట్విటర్‌లో బ్లూటిక్స్ కోసం ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘మోదీ ప్రభుత్వం బ్లూటిక్స్ కోసం పోరాడుతోంది. మీకు కోవిడ్-19 వ్యాక్సిన్ కావాలంటే స్వయం సమృద్ధంకండి’’ అని పేర్కొన్నారు.