కేంద్రం బియ్యం పేదలకు ఇవ్వడంలో కేజ్రీవాల్ విఫలం 

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆహార ధాన్యాలను ప్రజలకు సక్రమంగా అందజేయడంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని  ప్రభుత్వం విఫలమైందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా  ఆరోపించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన క్రింద ఇచ్చిన ఆహార ధాన్యాలను ఢిల్లీలోని నిరుపేదలకు అందజేయలేకపోయిందని విమర్శించారు.

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి జూన్ 5 వరకు దాదాపు 1 లక్ష టన్నుల ఆహార ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. జాతీయ ఆహార భద్రతా చట్టం క్రింద 37,400 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను;  పీఎం గరీబ్ కల్యాణ్ యోజన క్రింద 72,782 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఇచ్చినట్లు తెలిపారు. 

వీటిలో కేవలం 53,000 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళగలిగిందని, వీటిలో 68 శాతం ఆహార ధాన్యాలను మాత్రమే లబ్ధిదారులకు అందజేయగలిగిందని వివరించారు. 

అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాము అమలు చేయాలని తలపెట్టిన విప్లవాత్మకమైన ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ఈ పథకం కోసం ఐదుసార్లు అనుమతి పొందినట్లు తెలిపారు. 

ఈ నేపథ్యంలో సంబిత్ పాత్రా జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీలో పేదల హక్కులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోగొడుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారని, కానీ వాస్తవం అది కాదని చెప్పారు. నిజానికి మోదీ ఢిల్లీలోని పేదలకు రేషన్ సరుకులను అందజేస్తున్నారని చెప్పారు.