బహుళజాతి కంపెనీలపై 15% పన్ను

ఏళ్ల తరబడి చర్చల ప్రక్రియ తరువాత ఎట్టకేలకు గ్లోబల్ పన్నుల వ్యవస్థ విషయంలో జి 7 దేశాలు శనివారం చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రపంచస్థాయి డిజిటల్ యుగానికి అనుగుణంగా పన్నుల వ్యవస్థను తీర్చిదిద్దేలా ఈ ఒప్పందం రూపుదిద్దుకుంది. 

సుసంపన్న దేశాల కూటమిగా పేరొందిన ఏడు దేశాలతో కూడిన జి 7 కూటమి ఒప్పందంతో బహుళజాతి సంస్థలపై సమగ్ర పన్నుల విధింపు ద్వారా సక్రమ వాణిజ్య సరళికి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటివరకూ పన్నుల విధానాలలో సీమాంతర స్థాయిలో లొసుగులు ఉన్నాయి. 

వీటిని కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నాయి. వీటికి కళ్లెం వేయడానికి చాలా ఏళ్లుగా జి 7 కసరత్తు ప్రారంభించింది. ఈ దశలో గ్లోబల్ కార్పొరేషన్ టాక్స్ రేటు కనీసం 15 శాతం ఉండేందుకు తాము మద్దతు ప్రకటించామని ఈ కూటమి దేశాలు తెలిపాయి.

దీనికి అనుగుణంగా ఆయా బహుళజాతి కంపెనీలు తాము వ్యాపార వాణిజ్యాలు నిర్వహించుకునే దేశాలలో ఈ పన్నులను చెల్లించాల్సి ఉంటుందని బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషీ సునక్ విలేకరులకు తెలిపారు. ఇప్పటి దశలో కుదిరిన సమ్మతి వచ్చే నెలలో కుదిరే గ్లోబల్ పన్నుల ఒప్పందానికి ప్రాతిపదిక అవుతుందని రిషీ తెలిపారు.

దశాబ్దాలుగా బహుళజాతి కంపెనీలు తక్కువ స్థాయి పన్నులు, మినహాయింపులు పొందుతూ వచ్చాయి. కంపెనీలను తమ దేశాలకు ఆకర్షించుకునే దిశలో ఈ తంతు సాగింది. బహుళజాతి సంస్థలు వివిధ దేశాలలో వ్యాపారాలు సాగించుకుంటూ వచ్చాయి. ఈ దశలో వాటి వల్ల పన్నులు అత్యధిక శాతం కోల్పోయి పలు దేశాలు వందల కోట్ల డాలర్ల మేర తమ ఆదాయానికి గండిపడే పరిస్థితిని తెచ్చుకున్నాయి.

ప్రస్తుత కొవిడ్ దశలో పలు దేశాల ఆర్థిక పరిస్థితి కుమిలిపోయి ఉన్నదశలో అత్యవసరంగా లోటు భర్తీ చేసుకునేందుకు ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలను దేశాల సమగ్ర పన్నుల వ్యవస్థలోకి సరైన విధంగా తీసుకురావడం కీలకమైన విషయం అని బ్రిటన్ మంత్రి తెలిపారు.

జి 7 దేశాల ఆర్థిక మంత్రులు కరోనా వైరస్ సంక్షోభం తలెత్తిన తరువాత లండన్‌లో నేరుగా కలుసుకోవడం ఇదే తొలిసారి. గూగుల్, అమేజాన్, ఫేస్‌బుక్ వంటి మల్టీనేషనల్ కంపెనీల నుంచి అత్యధిక స్థాయి పన్నుల ద్వారా తమ ఆదాయ వనరులను పెంచుకునేందుకు సంపన్న దేశాలు చాలాకాలంగా యత్నిస్తున్నాయి.

అయితే వారి పెట్టుబడుల క్రమాల ఉపసంహరణ భయాలు ఇతరత్రా ఏకాభిప్రాయం లేకపోవడంతో ఈ విషయంలో ముందడుగు పడలేదు. అయితే ఇప్పుడు అనివార్యంగ జి 7 దేశాల పట్టుదలతో పన్నుల విధానంలో కీలక మార్పులకు దారి ఏర్పడింది.