మే నెలలో జీఎస్‌టీ వసూళ్లు 65 శాతం జంప్‌

ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ ప్రభావం పరిమితంగానేవుందన్న సంకేతాన్నిసూచిస్తూ మే నెలలో రూ.1.02 లక్ష ల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు జరిగాయి. రూ.1 లక్ష కోట్లకుపైగా జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం వరుసగా ఇది ఎనిమిదో నెల. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో వసూళ్లతో పోలిస్తే మే నెలలో 27 శాతం తగ్గాయి. కానీ 2020 మే నెల కంటే తాజాగా ముగిసిన నెలలో వసూళ్లు 65 శాతం పెరగడం గమనార్హం.

గతేడాది మే నెలలో దేశమంతా పూర్తి లాక్‌డౌన్‌లో వున్న సంగతి తెలిసిందే. 2021 మే నెలలో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.1,02,709 కోట్లని, అందులో సీజీఎస్‌టీ రూ.17,592 కోట్లుకాగా, ఎస్‌జీఎస్‌టీ రూ.22,653 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.53,199 కోట్లు (దిగుమతులపై వసూలైన రూ.26,002 కోట్లతో సహా), సెస్‌ రూ.9,265 కోట్లుగా (దిగుమతులపై వసూలైన రూ.868 కోట్లతో సహా) కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన వివరించింది.

కొవిడ్‌ కారణంగా పలు రాష్ట్రాలు  కఠిన ఆంక్షలతో లాక్‌డౌన్‌ అమలు జరుపుతున్నప్పటికీ, జీఎస్‌టీ వసూళ్లు రూ. 1 లక్ష కోట్లను మించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రూ.5 కోట్లలోపు టర్నోవర్‌ కలిగిన చిన్న పన్నుచెల్లింపుదార్లకు మే నెల జీఎస్‌టీ రిటర్నులు దాఖలు చేయడానికి జూలై మొదటి వారం వరకూ గడువు పెంచినందున, 2021 మే నెల వాస్తవ వసూళ్లు ఇంకా పెరగవచ్చని ప్రకటన పేర్కొంది.