ఇప్పట్లో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించలేం!

ఇప్పట్లో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించలేం!
ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించడం కుదరదని, ప్రజలకు ఉపశమనం కల్పించలేమని కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంకేతం ఇచ్చారు.  దేశంలో పెట్రో ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లీటరు పెట్రోలు వంద రూపాయలకు కూడా చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండడంపై స్పందిస్తూ ఈ వాఖ్యలు చేశారు.
 
కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ ఆదాయం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య రంగంపై గణనీయంగా ఖర్చులు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, దీంతో పాటు సంక్షేమ రంగంపై కూడా ఖర్చులు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ఆదాయం తగ్గిపోవడం, ఖర్చులు పెరిగిపోవడం నేపథ్యంలో పెట్రో ధరలు తగ్గించడం కుదిరే విషయం కాదని స్పష్టం చేశారు. 
 
అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటడం వల్లే మన దేశంలో ధరలు పెరిగాయని కేంద్రమంత్రి వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర 70 డాలర్లకు చేరుకుందని, అందుకే ధరలు మండిపోతున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.