బయోలాజికల్‌-ఇ నుండి 30 కోట్ల డోసుల టీకాలు 

భారీ వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా భారత్‌ మరో ముందడుగు వేసింది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఇ సంస్థకు చెందిన వ్యాక్సిన్లు 30 కోట్ల డోసులను అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. 

కాగా, ఈ వ్యాక్సిన్‌ ఇప్పటికీ ట్రయల్‌ దశలో ఉండగా, భారత్‌లో రూపొందిన రెండవ వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం. గతంలో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌… మొదటి స్వదేశీ వ్యాక్సిన్‌. 30 కోట్ల డోసులకు గానూ బయోలాజికల్‌ సంస్థకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూ.1500 కోట్లను అడ్వాన్సుగా చెల్లించనుంది. 

ఈ వ్యాక్సిన్‌ ఇప్పటికే పరీక్షించగా నేషనల్‌ ఎక్స్‌ఫర్ట్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌-19 (ఎన్‌ఇజివిఎసి) ఆమోదానికి సిఫార్సు చేయడం జరిగింది. ఈ వ్యాక్సిన్లు ఆగష్టు నుండి డిసెంబర్‌ వరకు ఉత్పత్తి, రవాణా జరుగుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

బయోలాజికల్‌-ఇ వ్యాక్సిన్‌ తొలి, రెండవ దశల ఫలితాల పూర్తవ్వగా, ప్రస్తుతం మూడవ దశలో ఉందని ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది. రానున్న నెలల్లో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని పేర్కొంది. ఆగస్టు నాటికి కోటి మందిని వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఇప్పటికే దేశంలో కోవాగ్జిన్‌, సీరమ్‌ నేతృత్వంలోని కోవిషీల్డ్‌ వినియోగిస్తున్నది. 

రష్యా స్పుత్నిక్‌-వి అందుబాటులోకి రాగా, విదేశీ సంస్థలు ఫైజర్‌, మెడర్నాల నిమిత్తం అక్కడి సంస్థలతో కేంద్రం చర్చలు జరుపుతోంది. పరిశోధన, అభివృద్ధి, వ్యయం వంటి అంశాల్లో సాయాన్ని అందించడం ద్వారా స్వదేశీ తయారీ సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న విస్తృత ప్రయత్నాల్లో ఇది ఓ భాగమని కేంద్రం పేర్కొంది.

 బయోలాజికల్‌-ఇ వ్యాక్సిన్‌  తో పాటు మరికొన్ని భారత్ లో తయారవుతున్న టీకాలు కూడా అందుబాటులోకి రావడానికి సిద్ధపడుతున్నాయి. అహ్మ‌దాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ జైడ‌స్ కాడిలా నుంచి జైకొవ్‌-డీ అనే కొవిడ్ వ్యాక్సిన్ వ‌స్తోంది. ఈ ఏడాది చివ‌రిలోపు 5 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. అంతేకాదు 5 నుంచి 12 ఏళ్ల మ‌ధ్య ఉన్న పిల్ల‌లపై కూడా ఈ సంస్థ త‌న వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పింది.

పుణెకు చెందిన జెన్నోవా బ‌యోఫార్మాసూటిక‌ల్స్ కంపెనీ కూడా హెచ్‌జీసీ019 పేరుతో కొవిడ్ వ్యాక్సిన్లు తయారు చేస్తోంది. ఈ సంస్థ 6 కోట్ల డోసులు ఇవ్వ‌నుంది. ఇండియాలో తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌పై ఈ సంస్థ ప‌ని చేస్తోంది. ప్ర‌స్తుతం తొలి ద‌శ ట్ర‌య‌ల్స్‌లో ఉంది. రెండు నెల‌ల్లో ఇది పూర్తి కానుంది. ఆ త‌ర్వాత రెండో ద‌శ ట్ర‌య‌ల్స్ ప్రారంభ‌మ‌వుతాయి.

ఇక ఇప్ప‌టికే కొవాగ్జిన్ టీకా త‌యారు చేస్తున్న హైద‌రాబాద్‌కే చెందిన భార‌త్ బ‌యోటెక్ నుంచి ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ కూడా వ‌స్తోంది. డిసెంబ‌ర్‌లోగా ఇలాంటి 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు రానున్న‌ట్లు గ‌త నెల‌లో కేంద్ర ఆరోగ్య శాఖ కూడా వెల్ల‌డించింది. ఇది కూడా ప్ర‌స్తుతం తొలి ద‌శ ట్ర‌య‌ల్స్‌లో ఉంది. ఈ వ్యాక్సిన్ పేరు బీబీవీ154.

అమెరికాకు చెందిన నొవావ్యాక్స్ కంపెనీ టీకాను ఇండియాలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేయ‌నుంది. ఈ మ‌ధ్యే అమెరికా ముడిస‌రుకుల‌పై నిషేధం ఎత్తేయ‌డంతో ఈ వ్యాక్సిన్ త‌యారీకి లైన్ క్లియ‌రైంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో ఈ వ్యాక్సిన్ ప్ర‌పంచ మార్కెట్‌లోకి రానుంది. డిసెంబ‌ర్‌లోగా సీరం 20 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వ‌నుంది.

వీటికి తోడు ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఉన్న కొవిషీల్డ్‌, కొవాగ్జిన్ డోసులు కూడా భారీగా వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. డిసెంబ‌ర్‌లోగా 75 కోట్ల కొవిషీల్డ్, 55 కోట్ల కొవాగ్జిన్ డోసులు రానున్న‌ట్లు అంచ‌నా వేసింది. ఇక ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు 15.6 కోట్ల డోసుల మేర అందుబాటులోకి రానున్నాయి.