యూజ‌ర్ల‌ను మోసం చేస్తోన్న వాట్సాప్‌ 

ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌ను మోసం చేస్తోంద‌ని ఢిల్లీ హైకోర్టుకు చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. త‌న అప్‌డేట్ చేసిన ప్రైవ‌సీ పాల‌సీని ఎలాగోలా యూజ‌ర్ల చేత యాక్సెప్ట్ చేయించ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని గురువారం దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌లో కేంద్రం స్ప‌ష్టం చేసింది. 

త‌ర‌చూ కొంద‌రు యూజ‌ర్ల‌కు నోటిఫికేష‌న్ల‌ను పంప‌డం ద్వారా బ‌ల‌వంతంగా వాళ్ల‌తో ప్రైవ‌సీ పాల‌సీని యాక్సెప్ట్ చేసేలా ఒత్తిడి తెస్తోంద‌ని అందులో తెలిపింది. ప‌ర్స‌న‌ల్ డేటా ప్రొటెక్ష‌న్ (పీడీపీ) బిల్లు చ‌ట్టంగా రూపొందేలోపే త‌న యూజ‌ర్లంద‌రినీ కొత్త ప్రైవ‌సీ పాల‌సీకి అంగీక‌రించేలా చేయ‌డ‌మే వాట్సాప్ ల‌క్ష్యంగా ఉన్న‌ద‌ని కేంద్రం తేల్చి చెప్పింది.

ఈ ఏడాది మార్చి 24న కాంపిటిష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాల‌కు పూర్తి విరుద్ధంగా వాట్సాప్ ప్ర‌స్తుత నోటిషికేష‌న్లు ఉన్నాయ‌ని కేంద్రం త‌న అఫిడ‌విట్‌లో స్ప‌ష్టం చేసింది.

 ప్ర‌స్తుత యూజ‌ర్ల‌కు నోటిఫికేష‌న్లు పంప‌కుండా వాట్సాప్‌ను ఆదేశించాల‌ని, అలాగే ఇప్ప‌టి వర‌కూ రోజువారీగా ఇలా పంపిన నోటిఫికేష‌న్ల సంఖ్య‌ను కూడా బ‌య‌ట‌పెట్టాల‌ని కేంద్రం కోరింది. ఇక ప్రైవ‌సీ పాల‌సీ క‌న్వ‌ర్ష‌న్ రేట్ (నోటిఫికేష‌న్‌ను యాక్సెప్ట్ చేసిన రేటు)ను కూడా స‌మ‌ర్పించాల్సిందిగా వాట్సాప్‌ను ఆదేశించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం కోర్టును అడిగింది.