టీకాలపై మేధో హక్కుల రద్దుకు బ్రిక్స్ బాసట 

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిపై సమిష్టి పోరుకు కరోనా టీకాలపై మేధో హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలని భారత్‌, దక్షిణాఫ్రికాలు ప్రతిపాదించాయి. ప్రపంచ దేశాలన్నిటికీ టీకాలను సమానంగా అందుబాటులోకి తీసుకురావాలని, టీకాల పంపిణీ, ధరల విధానంలోనూ పారదర్శకత ఉండాలని పేర్కొన్నాయి. 

భారత్‌, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు 5 దేశాలతో కూడిన బ్రిక్స్‌ మద్దతిచ్చింది. బ్రెజిల్‌, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ విదేశీ వ్యవహారాల మంత్రుల వర్చువల్‌ విధానంలో జరిగిన సమావేశంకు ఆతిథ్య దేశ హోదాలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ భేటీకి అధ్యక్షత వహించారు. 

కరోనా సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొవడంపై ఈ సమావేశం విస్తృతంగా చర్చించింది. ప్రపంచ ప్రజల ఆరోగ్య పరిరక్షణ, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల ప్రజల ప్రాణాల రక్షణకు టీకాల కార్యక్రమాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని, కాబట్టి టీకాలపై మేధో హక్కుల్ని తాత్కాలికంగా రద్దు చేయాలని సమావేశం సంయుక్తంగా డిమాండ్‌ చేసింది.

ఇలా ఉండగా, క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని పీడిస్తున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మేథో సంప‌త్తి హ‌క్కుల (ఐపీఆర్) విష‌యంలో ప‌రిశ్ర‌మ ప‌ట్టుద‌ల‌తో ఉండేందుకు అవ‌కాశం లేద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ స్పష్టం చేశారు. కొవిడ్-19 వ్యాక్సిన్ల‌పై ఐపీఆర్ ఎత్తివేత‌ను కోరుతూ ఉమ్మ‌డి స‌వాళ్ల‌ను స‌మిష్టి బాధ్య‌త‌తోనే ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు. 

రాబోయే రెండు ద‌శాబ్ధాల్లో ప‌లు త‌క్ష‌ణ ఆరోగ్య స‌వాళ్లు ఎదురుకానున్నాయ‌ని, దేశాల‌న్నీ ఒక స్ఫూర్తితో ముందుకు క‌ద‌లాల్సిన అవ‌స‌రం నెల‌కొంద‌ని ఆయన పిలుపిచ్చారు. డ‌బ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మ‌న్ గా హ‌ర్ష వ‌ర్ధ‌న్ ప‌ద‌వీకాలం పూర్త‌యిన సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు. అధికారం, గొంతుక లేని సామాన్యుల ప్రాణాల‌ను కాపాడేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని ప్ర‌పంచమంతా ఒక‌టే అనే స్ఫూర్తిని చాటేందుకు దేశాల‌న్నీ ఒక్క‌టి కావాల‌ని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడేందుకు సంప‌ద లేని వారికీ వ్యాక్సిన్లు అందుబాటులోకి రావాల‌ని డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కోరారు.