రూ.5,646 కోట్ల మాల్యా ఆస్తుల వేలంకు సిద్ధం 

లండన్‌లో తలదాచుకుంటున్న పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా ఆస్తుల్ని వేలం వేసేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మొండిబకాయిల కేసులో కోర్టు జారీచేసిన తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఆస్తులు, షేర్లను వేలంవేసి రూ.5,646 కోట్లను బ్యాంకులు రాబట్టుకోనున్నాయి.
 
కింగ్‌ఫిషర్‌కు రుణాలిచ్చిన ఎస్‌బీఐ నేతృత్వంలోని 11 బ్యాంకులు కన్సార్షియం ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా, రూ.5,646 కోట్ల విలువైన ఆస్తులు, షేర్లు విక్రయించుకునేందుకు కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఆ ఆస్తులు, షేర్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్వాధీనంలో వున్నాయి. 
 
ఉత్తర్వుల మేరకు తాము ఆ ఆస్తుల్ని అధీనంలోకి తెచ్చుకుని, నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం వేలం వేయనున్నట్లు ఎస్బీఐ అధికారి  ఒకరు తెలిపారు. 
 
బ్యాంకుల కన్సార్షియం కింగ్‌ఫిషర్‌కు ఇచ్చిన రుణం రూ.6,900 కోట్లుకాగా, అందులో అత్యధికంగా రూ.1,600 కోట్ల వాటా ఎస్బీఐది కాగా, పీఎన్‌బీకి రూ.800 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్‌ రూ.800 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.650 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ. 550 కోట్లు, సెంట్రల్‌ బ్యాంక్‌ రూ. 410 కోట్ల చొప్పున రుణాలిచ్చాయి.