ఆదివారం, సెలవు రోజుల్లో కూడా ఖాతాలో జీతం

ఇక నుంచి ఆదివారం అయినా, సెలవు రోజుల్లో అయినా ఉద్యోగుల జీతం వారి ఖాతాల్లో పడుతుంది. బిల్స్ డబ్బు జమ అవుతుంది. మనకు రావాల్సిన డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఇందుకోసం వచ్చే నెల నుంచి ప్ర‌తి రోజూ వివిధ బ్యాంకుల ఖాతాదారుల లావాదేవీల కోసం నేష‌న‌ల్ ఆటోమేటెడ్ క్లియ‌రింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్‌) సిస్ట‌మ్ అందుబాటులో ఉంచాల‌ని ఆర్బీఐ నిర్ణ‌యించింది.
ఆదివారాల‌తోపాటు అన్ని బ్యాంకు సెల‌వు దినాల్లోనూ ఎన్ఏసీహెచ్ వ్య‌వ‌స్థ ప‌ని చేస్తూనే ఉంటుంది. దీనివల్ల  జీతం, పెన్షన్, వడ్డీ, డివిడెండ్  ఇతర చెల్లింపులు,  పెట్టుబడులు బ్యాంక్ సెలవు దినాలలో కూడా డెబిట్/క్రెడిట్ అవుతాయి. బల్క్ పేమెంట్ సిస్టమ్ కోసం ఎన్‌పీసీఐ నాచ్‌ను డెవెలప్ చేసింది. ఈ టెక్నాలజీ.. డివిడెండ్, వడ్డీ, జీతం, పెన్షన్ మొదలైన వాటి బదిలీలను సులభతరం చేస్తుంది,
విద్యుత్, గ్యాస్, టెలిఫోన్‌, వాటర్ బిల్లు, ఈఐఎంలు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల కిస్తీలు, బీమా ప్రీమియం మొదలైనవాటిని బ్యాంకు ఖాతాల నుంచి మినహాయించుకొని సర్వీసు ప్రొవైడర్‌కు చెల్లిస్తుంది. “కస్టమర్ల సౌకర్యం కోసం ఇక నుంచి నాచ్, ఆర్టీజీఎస్‌ ట్రాన్స్​ఫర్లను  24×7 పాటు అందుబాటులో ఉంచాలని ప్రపోజ్ చేశాం. వచ్చే నెల నుంచి ఈ సదుపాయం అమల్లోకి రావొచ్చు” అని ఆర్​బీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
ఈ మేర‌కు శుక్ర‌వారం జ‌రిగిన ఆర్బీఐ ద్ర‌వ్య ప‌ర‌ప‌తి స‌మీక్షా స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ తెలిపారు. మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ మొద‌లు హోం/కారు/ ప‌ర్స‌న‌ల్ లోన్‌, టెలిఫోన్ లేదా గ్యాస్ లేదా ఎల‌క్ట్రిసిటీ బిల్లుల చెల్లింపులు కూడా ఆదివారాలు, సెల‌వు దినాల్లో పూర్తి చేయొచ్చు.
ఇప్ప‌టి వ‌ర‌కు ఆదివారం/ సెల‌వు దినాల్లో ఉద్యోగుల ఖాతాల్లో వేత‌నాలు జ‌మ కాలేదు. ఇంత‌కుముందు ఆటోమేటిక్ చెల్లింపులు లేవు. ఎన్ఏసీహెచ్ ఒక సామూహిక చెల్లింపుల వ్య‌వ‌స్థ‌. నేష‌న‌ల్ పేమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) దీన్ని నిర్వ‌హిస్తున్న‌ది. డివిడెండ్‌, ఇంట‌రెస్ట్‌, శాల‌రీ, పెన్ష‌న్ వంటి బ‌హుముఖ ఖాతాల‌కు ఎన్ఏసీహెచ్ సిస్ట‌మ్ వ‌ర్తింప‌జేస్తున్నారు. ఇక‌నుంచి అన్ని ర‌కాల యుటిలిటీ బిల్లుల చెల్లింపుల‌కు అమ‌లు చేస్తున్నారు.
వివిధ సామాజిక‌, సంక్షేమ ప‌థ‌కాల, సబ్సిడీల‌ అమ‌లుకు కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ (డీబీటీ) ప‌థ‌కంతో ఎన్ఏసీహెచ్ పాపుల‌రైంది. అంతే కాదు పార‌ద‌ర్శ‌క‌త‌కు మారుపేరుగా నిలిచింది. క‌రోనా వేళ స‌కాలంలో ప్ర‌భుత్వ సబ్సిడీ ప‌థ‌కాల అమ‌లుకు స‌హాయ‌కారిగా నిలిచింది.
ఈ సదుపాయం ఫలితంగా పరిశ్రమలకు మరింత క్యాపిటల్ సులువుగా దొరుకుతుంది. ఆర్ధిక వ్యవస్థకు సహితం మేలు జరుగుతుందని భావిస్తున్నారు. నాచ్ ద్వారా ఎలక్ట్రానిక్స్ క్లియరెన్స్ సేవలు (ఈసీఎస్) 2016 మే నుంచి మొదలయ్యాయి.  ఇక నుంచి బ్యాంక్ ఖాతా నుండి ఆటో-డెబిట్ ఇన్‌స్ట్రక్షన్‌ ఇవ్వడం కోసం తప్పక నాచ్ ఫంక్షన్‌ను ఉపయోగించాలి.