
కరోనా మహమ్మారి నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు అయ్యాయి. ఉన్నతాధికారులు, మంత్రివర్గ సహచరులతో ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలోఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యమని కేంద్రం తేల్చి చెప్పింది.
విద్యార్థుల ఆరోగ్యం, భద్రత తమకు చాలా ప్రాముఖ్యమని ఈ అంశంలో ఎటువంటి రాజీ ఉండదని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొని ఉందని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యార్థులు పరీక్షలకు బలవంతంగా హాజరుకావొద్దని హితవు చెప్పారు.
ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోమ్ మంత్రి అమిత్ షా, పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్, స్మ్రితి ఇరానీ, నిర్మల సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ లతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్బిఈ) చైర్మన్ మనోజ్ అహుజా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పరీక్షల రద్దుతో సీబీఎస్ఈ ఇప్పుడు ఆబ్జెక్టివ్ ప్రమాణాల ప్రకారం ఫలితాలను వెల్లడించేందుకు చర్యలు చేపట్టనుంది. గతేడాది మాదిరిగానే ఎవరైనా విద్యార్థులు పరీక్షలు రాయాలనుకుంటే పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడు వారు పరీక్షలను రాయొచ్చు.
12వ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు, ఇతర పక్షాలతో చర్చించిన మీదట.. ప్రభుత్వం ముందున్న అన్ని అవకాశాలపైనా ప్రధాని సమీక్షించారు. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను కూడా గతంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఫలితాల వెల్లడి విషయంలో అబ్జెక్టివ్ విధానాన్ని అవలంభించాలని నిర్ణయించారు. నిర్ణీత సమయంలో ఫలితాలను ప్రకటించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
సిబిఎస్ఇ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. విద్యార్థుల ఆరోగ్యంపట్ల ఆందోళన చెందామని కేజ్రీవాల్ తెలిపారు. సిబిఎస్ఇ పరీక్షల రద్దుపై ప్రధాని నిర్ణయం పట్ల హర్షం ప్రకటించారు.
More Stories
భారత్ ఇకపై ఉగ్రవాద బాధితురాలిగా ఉండదు
`జగన్నాథుడి’ ఒడిశాకోసం ట్రంప్ ఆహ్వానం తిరస్కరించా
ఇరాన్ గగనతలాన్ని తెరవడంతో 290 మంది రాక