దీదీ,  మోదీ ప్రభుత్వాల మధ్య ఆలాపన్‌ చిచ్చు 

ప్రధాని నరేంద్ర మోదీ యాస్ తుపాన్ పర్యటన సందర్భంగా బెంగాల్ లో సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ గైర్హాజరుతో మొదలైనవివాదం చిలికిచిలికి గాలివానలా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానమంత్రి సమీక్షకు హాజరుకాకపోవడంతో బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బంధోపాధ్యాయను రీకాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 

అయితే  మమత ససేమిరా అంగీకరించకుండా, అభ్యంతరం  వ్యక్తం చేస్తూ కేంద్రానికి వ్రాసిన లేఖకు జవాబు కోసం కూడా ఎదురు  చూడకుండా,  ఆలాపన్‌తో రాజీనామా చేయించి, తన ప్రత్యేక సలహాదారుగా మమత నియమించుకోవడం నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సీఎస్‌గా ఆలాపన్ బందోపాధ్యాయ్ పదవీ విరమణ చేసినా, ఆయనపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆయనకు త్వరలోనే కేంద్రం ఛార్జ్‌షీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

బందోపాధ్యాయకు కేంద్రం షోకాజ్ నోటీసు పంపింది. ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన సమావేశానికి టాప్ బ్రూరోక్రాట్‌గా ఆయన గైర్హాజరుపై వివరణ కోరుతూ ఈ నోటీసు ఇచ్చింది. డిజాస్టర్ మేనేజిమెంట్ యాక్ట్ కింద ఈ నోటీసులిచ్చారు. బెంగాల్‌లో ‘యాస్’ తుపానుపై సమీక్షిచేందుకు ప్రధాని హాజరైన సమయంలో ఆయన పాల్గొనకపోవడానికి కారణం ఏమిటో మూడు రోజుల్లోగా తెలియచేయాలని ఆ నోటీసులో కేంద్రం పేర్కొంది.

సోమవారం నాటికి ఆలాపన్ ఉదయం 10 గంటలకల్లా ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే ఆలాపన్‌ను సీఎం మమత రిలీవ్ చేయలేదు. కేంద్రం ఈ చర్య తీసుకున్న కొద్ది నిమిషాల తర్వాత అల‌ప‌న్‌ను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదవీ విరమణ చేయించి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా మమతా  నియ‌మించారు.

పశ్చిమబెంగాల్ రాష్ట్ర కేడర్ కు చెందిన 1987 ఐఎఎస్ అధికారి బందోపాధ్యాయ పదవీ కాలం మే 31తో ముగిసింది. ఆయనకు అంతకు నాలుగు రోజుల ముందే ఆయన  పదవీ కాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది.