రాజస్థాన్‌లో 11.5లక్షల టీకా డోసులు వృధా

రాజస్థాన్‌లో 11.5లక్షల మోతాదుల కరోనా వ్యాక్సిన్‌ వృధా అయ్యాయని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆరోపించారు. అయితే, రాజస్థాన్‌లో వ్యాక్సిన్ వృధా రెండు శాతం కంటే తక్కువగా ఉందని, ఇది జాతీయ సగటు 6 శాతం కంటే తక్కువ అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

కాగా, వ్యాక్సిన్ల వృధాను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అఖిల్‌ అరోరా ఖండించారు. మీడియాలో వచ్చిన కథనాలపై ఆయా జిల్లాల్లో టీకాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.

వ్యాక్సిన్‌ బాటిల్స్‌ను చెత్త కుప్పల్లో వేసినట్లు వచ్చిన మీడియా కథనాలను ప్రస్తావిస్తూ కేంద్రమంత్రి రాజస్థాన్‌ ప్రభుత్వం టీకాలు వేయడంలో కేరళను చూసి నేర్చుకోవాలని హితవు చెప్పారు. టీకా డ్రైవ్‌పై అశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వంలోని రాజస్థాన్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ఆరోపణలు చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం మొదట 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గల వారికి టీకాలు వేసేందుకు అనుమతి కోరిందని, గ్లోబల్‌ టెండర్ల నాటకం ఆడిందని విమర్శించారు. అది విజయవంతం కాకపోవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రాన్ని నిందిస్తుందని వర్చువల్‌ మీడియా సమావేశంలో షెకావత్‌ ఆరోపణలు చేశారు.