వ‌చ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు

వ‌చ్చే ఏడాది ప్రారంభంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వ‌హించ‌గ‌ల‌మ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీ) విశ్వాసంతో ఉంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌ల‌తోపాటు గోవా అసెంబ్లీల‌కు వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌రుగాల్సి ఉంది. స‌కాలంలోనే ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని కేంద్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సుశీల్ చంద్ర చెప్పారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ గ‌డువు 2022 మే నెలాఖ‌రుతో ముగుస్తుంది. మిగ‌తా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ గ‌డువు మార్చి నెల‌తో తీరిపోతుంది. క‌రోనా ఉధ్రుతి నేప‌థ్యంలో బీహార్‌, ప‌శ్చిమ బెంగాల్‌ల‌తోపాటు ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో చాలా అనుభ‌వం గ‌డించామ‌ని సుశీల్ చంద్ర  ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

గ‌డువు తీరిపోయే లోపు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించి, గెలుపొందిన శాస‌న‌స‌భ్యులు జాబితాను సంబంధిత రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌కు స‌మ‌ర్పించ‌డం త‌మ విధి అని చెప్పారు. తాజాగా శాస‌న‌మండ‌లి/ రాజ్య‌స‌భ ద్వైవార్షిక ఎన్నిక‌ల‌తోపాటు కొన్ని లోక్‌స‌భ‌, అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక‌ల‌ను క‌రోనా నేప‌థ్యంలో వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.

క‌రోనా రెండో వేవ్ తీవ్ర‌త గురించి తాము అవ‌గాహ‌న‌తోనే ఉన్నాం అని సుశీల్ చంద్ర వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం కేసుల సంఖ్య త‌గ్గుతున్న‌ద‌ని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు క‌రోనా మ‌ధ్యే నిర్వ‌హించాం అని గుర్తు చేశారు. 

ఇటీవ‌లే మ‌రో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా నిర్వ‌హించామ‌ని చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో చాలా అనుభ‌వం గ‌డించామ‌ని తెలిపారు. పంజాబ్ మిన‌హా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.

గ‌తేడాది బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లను కోవిడ్‌-ప్రీ ఎల‌క్ష‌న్‌గా నిర్వ‌హించ‌డానికి ఈసీ ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్న‌ది. 80 ఏండ్లు దాటిన వారికి, కోవిడ్‌తో బాధ‌ప‌డుతున్న వారికి పోస్ట‌ల్ బ్యాలెట్ ఉప‌యోగించుకునే వెసులుబాటు క‌ల్పించింది.

ప్ర‌తి పోలింగ్ కేంద్రంలోనూ ఓటు వేసే ఓట‌ర్ల సంఖ్య‌ను 1500 నుంచి 1000 మందికి త‌గ్గించివేసింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ప‌రిధిలో సుమారు 80 వేల పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. ఇదే ప‌ద్ధ‌తి వ‌చ్చే ఏడాది జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొన‌సాగుతుంద‌ని సుశీల్ చంద్ర చెప్పారు.