కోవిడ్ వ్యాక్సిన్లు, ఔషధాలను పేటెంట్ రహితంగా మార్చాలి

కోవిడ్ వ్యాక్సిన్లు, ఔషధాలను పేటెంట్ రహితంగా మార్చాలని, వాటిని ఉత్పత్తి చేయగల అన్ని ఉత్పత్తిదారులకు వాక్సిన్, ఔషధాల సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్ చేసింది. అందుకై, “ప్రపంచం మొత్తానికి అందుబాటు ధరలలో టీకాలు, ఔషధాలు లభించాలి”  అని కోరుతూ దేశ వ్యాప్త ఉద్యమం ప్రారంభించింది.

ఈ ఉద్యమంలో భాగంగా ‘వ్యాక్సిన్, ఔషధాల యూనివర్సల్ యాక్సెస్’ పిటిషన్ ద్వారా భారత దేశంలో, ప్రపంచంలో ఉన్న వివిధ సామాజిక, సాంస్కృతిక సంస్థలు, విద్యా సంస్థలు, మేధావులు, విద్యావేత్తలు, న్యాయమూర్తుల నుండి సంతకాల సేకరణ చేపట్టింది. ఇప్పటికే భారత్ తో పాటు మరో 20 దేశాల నుండి 4 లక్షల ఏమండీ వరకు డిజిటల్ సంతకాలతో ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన్నట్లు స్వదేశీ జాగరణ్ మంచ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ముక్క హరీష్ బాబు తెలిపారు.

ఈ పిటిషన్ లో ప్రపంచ వాణిజ్య సంస్థ మేధో సంపత్తి హక్కుల నిబంధనలను సడలించాలని, గ్లోబల్ ఫార్మాస్యూటికల్ తయారీదారు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు ప్రపంచ మానవాళి రక్షణ కోసం ఇతర తయారీదారులకు సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో సహా పేటెంట్ రహిత హక్కులను స్వచ్ఛందంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా, పేటెంట్ హోల్డర్లు కాకుండా అన్ని రకాల ఇతర ఔషధ తయారీదారులు టీకాలు, ఔషధాల తయారీకి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి సామగ్రి కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, అటువంటి ఔషధ తయారీదారులకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాడటానికి, టీకాలు, ఔషధాలను  ప్రపంచo మొత్తానికి లభించే విధంగా, దేశభక్తి గల ప్రజలు, సంబంధిత సంస్థలు ముందుకు వచ్చి మానవాళిని రక్షించే ఈ మహత్తర కార్యంలో పాలుపంచుకోవాలని పిలుపిచ్చారు.

ట్రిప్స్ ఒప్పందంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పేటెంట్స్  మాఫీ కోరుతూ భారత ప్రభుత్వం దక్షిణాఫ్రికాతో కలిసి అక్టోబర్‌లోనే పేటెంట్ రహిత వ్యాక్సిన్లు, ఔషధాలను సులభతరం చేయడానికి  ప్రపంచ వాణిజ్య సంస్థలో చేసిన ప్రతిపాదనకు 120 దేశాలు ఇప్పటివరకు మద్దతు ఇచ్చాయని జాగరణ్ మంచ్ రెండు తెలుగు రాష్ట్రాల సంపర్క్ ప్రముఖ్ పి శ్రీనాథ్ తెలిపారు.

ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే దేశాలు/ కంపెనీలు/వ్యక్తుల సమూహాలను ఎటువంటి సంకోచం లేకుండా స్వదేశీ జాగారణ మంచ్ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ప్రపంచ ప్రజల మానవత్వం కోసం, సమాజం మొత్తాన్ని భారత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు మద్దతు తెలపాలని కోరారు.

భారతదేశ జనాభాలో కనీసం 70 శాతం మందికి టీకాలు వేయడానికి 200 కోట్ల డోసుల టీకాలు అవసరం కాగలవు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. దీని కోసం అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం అవసరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి, పేటెంట్లు, వాణిజ్య రహస్యాలతో సహా మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన అడ్డంకులను అధిగమించడానికి అన్నిరకాల చర్యలు అవసరం అని మంచ్ తెలంగాణ కో-కన్వీనర్ నాగరత్నం నాయుడు పేర్కొన్నారు.

దీనికి సంబంధించి వివిధ విశ్వవిద్యాలయాలతో  స్వదేశీ జాగరణ మంచ్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీలు కలిసి అంతర్జాతీయ సమావేశాన్ని 20 మేన నిర్వహించాయి. దీనిలో అమెరికా నుండి  హోవార్డ్ విశ్వవిద్యాలయం వారు కూడా పాల్గొన్నారు. ఇజ్రాయెల్, అమెరికా, బ్రిటన్ దేశాల వయోజన జనాభాకు దాదాపుగా పూర్తి టీకాలు వేసిన కారణంగా ఈ దేశాలలో కరోనా సహా ప్రపంచంలోని మిగతా మొత్తం జనాభాకు వెంటనే టీకాలు వేయడం అవసరం ఉందని హరీష్ బాబు తెలిపారు.