మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఈటల సోమవారం సాయంత్రం బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ సీనియర్ నేత జి.వివేక్ వెంకట్‌స్వామిలతో కలిసి నడ్డాను కలిశారు.
సుమారు 45 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన పరిణామాలు, పార్టీలో చేరిక సహా అనేక అంశాలపై ఈటలతో నడ్డా చర్చించారు. పార్టీలో చేరాలని, అన్ని విధాలుగా అండగా నిలుస్తామని వారికి నడ్డా భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
తనకు, తనతోపాటు పార్టీలోకి వచ్చేవారికి సముచిత గౌరవం ఇవ్వాలని ఈటల కోరగా.. తగిన ప్రాధాన్యం ఇస్తామని నడ్డా హామీ ఇచ్చిన్నట్లు చెబుతున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారంతా బీజేపీ వైపు చూస్తున్నారని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అనుగుణంగా తాను పనిచేస్తానని ఈటల ఈ సందర్భంగా చెప్పారు.
ఇక త్వరలోనే ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడానికి రాజేందర్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఆయనతో పాటు నడ్డాను కలిసిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడి కూడా బీజేపీలో చేరనున్నారు.
బీజేపీ, టీఆర్‌ఎస్ ఒకటేనని సీఎం కేసీఆర్ ప్రచారం చేయిస్తూ.. ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాజేందర్ ఈ భేటీలో ప్రస్తావించారు . భవిష్యత్తులో రెండు పార్టీలు కలిస్తే తమ పరిస్థితేంటని ప్రశ్నించారు. దీంతోపాటు కేసీఆర్ తనను వేధిస్తున్న విషయాన్ని కూడా నడ్డా దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో నడ్డా స్పందిస్తూ.. తెలంగాణలో దుర్మార్గాలు పెరిగిపోతున్నాయని, టీఆర్‌ఎ్‌సతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో పోరాడుతున్న తరహాలోనే టీఆర్‌ఎ్‌సపైనా పోరాటం ఉంటుందని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అవినీతిమయంగా మారిందని, వారిపై ఏ సమయంలో విచారణ జరిపించాలో తమకు తెలుసునని కూడా పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, దీనిపై పార్టీ కార్యకర్తలకు పూర్తి విశ్వాసం ఉందని నడ్డా భరోసా వ్యక్తం చేశారు. పార్టీలో చేరే విషయమై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నడ్డా కోరారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్తులతో చర్చలు జరిపే విషయంతో పాటు, పార్టీ బలోపేతానికి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై తరుణ్ ఛుగ్‌తో ఈటల చర్చించారు.
కేంద్రం ప్రకటించిన ఏ పథకాన్ని అయినా నేరుగా అమలు చేయకుండా, తొలుత కేసీఆర్ విమర్శిస్తారని, ఆ తరువాత మళ్లీ కేంద్ర పథకాన్ని అమలు చేయడంతో ప్రజల్లో అనుమానానికి బలం చేకూరుతోందని ఈటెల చెప్పారు. ఇటీవల ఆయుష్మాన్ భారత్ వంటి పథకం అమలు విషయంలో టీఆర్‌ఎస్ నాయకత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావించారు.
More Stories
తెలంగాణలో ఏపీ క్యాడర్ అధికారుకు ఏపీ వెళ్లాలని ఆదేశం
రతన్ టాటా మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం
వర్గీకరణకు కమిషన్ పేరుతో ఉద్యోగ భర్తీకి ఎగనామం!