రాజ్‌నాథ్ కు జగన్ పై రఘురామ ఫిర్యాదు   

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక వంక తన ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సంబరాలలో మునిగి ఉండగా, ఆయన పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆయనపై ఫిర్యాదు చేశారు.

కాలికి గాయం కారణంగా నడవకూడదని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు సూచించిన నేపథ్యంలో రఘురామ వీల్ చెయిర్ లోనే  ఆదివారం రాజ్ నాథ్ సింగ్ నివాసానికి వెళ్లారు. సీఐడీ కేసు నుంచి ఎయిమ్స్ లో చికిత్స వరకు ఇటీవల జరిగిన పరిణామాలను కేంద్రమంత్రికి క్లుప్తంగా వివరించారు.

తనపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయనకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రాజద్రోహం కేసులో అరెస్టయిన రఘురామను కస్టడీలో ఏపీ పోలీసులు వేధించారన్న ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. పోలీసులు కొట్టడం వల్ల తగిలిన దెబ్బలు అంటూ రఘురామ ఆరోపించారు. ఈ వ్యవహారం సీఐడీ కోర్టు పరిధిని దాటి హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించారు.

  ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ పై ఆరోపణలు  

ఇలా ఉండగా, ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. తనను ఆర్మీ ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జ్‌ చేసేందుకు, వైద్యులపై కేపీరెడ్డి ఒత్తిడి తెచ్చారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్‌నాథ్‌సింగ్‌కు మూడు పేజీల లేఖను అందజేశారు. 

అందులో తనను మళ్లీ పోలీసు కస్టడీకి పంపించేందుకు ముగ్గురు అధికారులు కుట్ర పన్నారని ఆరోపించారు.  వీరిలో ఒకరు గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి కాగా.. మిగతా ఇద్దరు ప్రస్తుతం టీటీడీ అదనపు ఈవోగా పనిచేస్తున్న డిఫెన్స్‌ ఆడిట్‌ అకౌంట్స్‌ సర్వీసు ఉద్యోగి ధర్మారెడ్డి, మిలిటరీ ఆస్పత్రి రిజిస్ర్టార్‌ కేపీ రెడ్డి అని వెల్లడించారు. 

వీరిద్దరూ రక్షణ శాఖ ఉద్యోగులైనందువల్ల వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. మఫ్టీ పోలీసులు ఆస్పత్రిలో మకాం వేసేందుకు కేపీ రెడ్డి సహకరించారని ఆరోపించారు. 15 మంది ఏపీ పోలీసుల మెస్ బిల్లులను కూడా లేఖకు రఘురామ జతపర్చారు.

కోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించి రఘురామరాజును మళ్లీ అరెస్టు చేసేందుకు కుట్రపన్నిన ధర్మారెడ్డి, కేపీ రెడ్డిలపై విచారణ జరిపిస్తానని రాజ్‌నాథ్‌ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.