రెండేళ్ల పాలన సంపూర్ణ సంతృప్తినిచ్చింది

మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలను దేవుడి దయతో, ప్రజల దీవెనలతో అమలు చేయడం సంపూర్ణ సంతృప్తిని ఇచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఇదే తరహాలో మరో మూడేళ్ల పాలన కూడా సాగుతుందని భరోసా ఇచ్చారు. రెండేళ్ల పాలన సందర్భంగా ‘‘రెండో ఏటా ఇచ్చిన మాటకే పెద్దపీట’’ పుస్తకాన్ని ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. 

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94.5శాతం పూర్తి చేశామని, 86 శాతం ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాయని సీఎం వివరించారు. ప్రతి ఇంటికీ చేరేలా పథకాలు చేపట్టామని పెక్రోన్నారు. ఈ రెండేళ్లలో ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ.95,528కోట్లు, పరోక్షంగా రూ.36,197కోట్లు జమ చేశామని చెప్పారు. 

రాష్ట్రంలోని 86శాతం మంది ఏదోవిధంగా లబ్ధి పొందారన్నారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగామని చెప్పారు. ఇంకా మంచి చేయడానికి ముఖ్యమంత్రిగా, కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయపడతానని వెల్లడించారు. ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పరిపాలన అందిస్తానని చెప్పారు.

ఈ సందర్భంగా తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ జగన్‌ ధన్యవాదాలు తెలిపారు.  ప్రజలకు ఏ కష్టమొచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వగలిగామని చెబుతూ  ప్రతి ఒక్కరి సహకారంతోనే సుపరిపాలన అందించగలిగామని సీఎం పేర్కొన్నారు. ఇవాళ రూ.95,528 కోట్లు డీబీటీ ద్వారా.. అంటే నగదు బదిలీ ద్వారా, మరో రూ.36,197 కోట్లు పరోక్షంగా (నాన్‌ డీబీటీ) ప్రజలకు చేరాయి. అంటే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, ఇళ్ల స్థలాలు, వైఎస్సార్‌ కంటి వెలుగు వంటి పథకాల ద్వారా అందాయని తెలిపారు.

ఇవన్నీ లెక్క వేసుకుంటే మొత్తం రూ.1,31,725 కోట్లు నేరుగా ప్రజలకు అందాయి. వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి.. లంచాలు, వివక్ష లేకుండా.. నేరుగా ప్రతి పథకం ప్రజల గడప వద్దకే వెళ్లి అందించగలిగాం. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంత గొప్పగా చేయగలిగామని వివరించారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో పని చేస్తున్న ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు.. గ్రామ వలంటీర్లుగా లాభాపేక్ష లేకుండా అంకిత భావంతో పని చేసిన ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడు మొదలు కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలతో ఈ స్థాయిలో ఇంత మంచి చేయగలిగామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.