పోలీస్ వలయంలో ఆనందయ్య, పెద్దలకు గోప్యంగా మందు 

ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య మందుకు ప్రభుత్వ అనుమతిపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఆనందయ్య ఇంకా కృష్ణపట్నం గోపాలపురంలోని కేపీఎస్ఎస్పీఎల్ అకాడమీలోనే ఉన్నారు. ఆనందయ్య చుట్టూ పోలీసులు వలయంలా ఉన్నారు. ఆయనను ఎటూ కదలనీయడం లేదు. 

మరోవైపు పెద్దల కోసం పెద్ద ఎత్తున గోప్యంగా మందు తయారీ చేస్తూనే ఉన్నారు. శనివారం నాడు నాలుగు నల్ల రంగు కార్లలో బకెట్లతో మందు ఎత్తుకెళ్లినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆ కార్లలో మందు తీసుకెళ్లింది  కృష్ణా జిల్లాకి చెందిన ఓ మంత్రి అని చెబుతున్నారు. 

అనేకమంది అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు గోప్యంగా తయారు చేస్తున్న మందును పెద్ద ఎత్తున తీసుకు వెడుతూనే ఉన్నట్లు కధనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గత 21 నుండి ఆనందయ్య మందు పంపిణిని ప్రభుత్వం నిలిపి వేయడం తెలిసిందే. 

ఇలా ఉండగా, ఆనందయ్య మందుకు రెండు రోజుల్లో ప్రభుత్వ అనుమతి వచ్చే అవకాశాలున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆనందయ్య మందుపై వివాదాలు సృష్టించేందుకు కొంతమంది పనికట్టుకొని రాజకీయ రగడ సృష్టిండానికి ప్రయత్నం చేస్తున్నారని, అయినా సంయమనం పాటిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వ అనుమతి రాగానే బొనిగి ఆనందయ్య ఆధ్వర్యంలోనే కరోనా మందును తయారుచేసి సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి పంపిణీ చేస్తామని చెప్పారు. 

కాగా,  ఆనందయ్య మందుపై దుష్ప్రచారం వద్దని, నివేదికను బట్టి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి తల్లోజు  చెప్పారు. నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం నెల్లూరు జిల్లా అధికారులతో కరోనాపై సమీక్ష నిర్వహించారు.  భారతీయ సనాతన ధర్మంలో ఆయుర్వేదం ఒక భాగమని, త్వరలోనే ఆనందయ్య మందుపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.