ఎల్ఓసీపై 3 నెల‌లుగా ఒక్క బుల్లెట్ పేల‌లేదు 

స‌రిహ‌ద్దు రేఖ వెంబ‌డి గ‌త మూడు నెల‌లుగా ఒక్క బుల్లెట్ కూడా పేల‌లేద‌ని భార‌త ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వ‌ణె స్పష్టం చేశారు. పాకిస్తాన్ వైపు నుంచి కాల్పుల విర‌మ‌ణ త‌ర్వాత ఎల్ఓసీ వెంట ప్ర‌శాంతత నెల‌కొన్న‌ద‌ని చెప్పారు. ఇది ఇలాగే కొన‌సాగితే రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డ‌తాయ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

ఒక వార్తా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చాలా కాలం తర్వాత‌ భారతదేశం-పాకిస్తాన్ మధ్య సంబంధాలలో మెరుగుదల కనిపిస్తున్న‌దని పేర్కొన్నారు. గత 3 నెలలుగా ఎల్ఓసీపై కాల్పులు జరుగక పోవడం ఇరు దేశాల మధ్య సంబంధాన్ని మెరుగుపర్చడానికి ఇది మొదటి మెట్టు అని అభివర్ణించారు. సరిహద్దులో చొరబాట్లు, ఉగ్రవాద సంఘటనలను తగ్గించడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్ముక‌శ్మీర్‌లో గ‌త ఏడాదిలో హింసాకాండ కేసులు గణనీయంగా త‌గ్గాయని చెబుతూ ఉగ్రవాదులపై నిరంతరం దృష్టి పెడుతున్నామని తెలిపారు.

సెర్చ్‌ ఆపరేషన్‌ను క‌ఠినంగా అమలు చేస్తున్నామని, బ‌య‌టి నుంచి ఆయుధాలు స‌ర‌ఫ‌రా కాకుండా గట్టి చ‌ర్య‌లు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గ‌తంలో కశ్మీర్ యువత పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడేవారని చెబుతూ వీటిపై నిరంతరం నిఘా ఉంచామని, వీటి బారిన ప‌డ‌కుండా యువతను రక్షించామని చెప్పారు.

ఇక్కడి యువత ప్రతిభావంతులు. చాలా మంది యువకులు క్రీడలు, విద్యలో ప్రతిభను ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. స్థానిక యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరే సంఘటనలు బాగా తగ్గాయని, కశ్మీర్ సామాన్యులు శాంతిని కోరుకుంటున్నారని న‌ర‌వ‌ణె తెలిపారు. 

జమ్ముక‌శ్మీర్ ప్రత్యేక హోదాను భారత్ తొలగించిన‌ప్ప‌టి నుంచి దీనిని పాకిస్తాన్ అంతర్జాతీయ సమస్యగా మార్చడానికి ప్రయత్నించింది, అయితే, అది విజయవంతం కాలేదు. ఉగ్రవాద రహిత వాతావరణం కావాల‌ని పాకిస్థాన్‌కు స్ప‌ష్టం చేశామని గుర్తు చేశారు.

ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి అమెరికా త‌న సైనిక‌ దళాలను ఉపసంహరించుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తాలిబాన్లు గ‌తంలో మాదిరిగా రెచ్చిపోర‌ని గ్యారంటీ ఏదీ లేదని స్పష్టం చేశారు. పూర్తిగా శాంతి నెల‌కొనేంత వ‌ర‌కు అమెరికా సైన్యం ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉంటే బాగుండేద‌ని న‌ర‌వ‌ణె అభిప్రాయ‌ప‌డ్డారు.