ముస్లింలకు స్కాలర్‌షిప్‌ పై ఇరకాటంలో విజయన్ 

కేరళ హైకోర్టు ఆరేండ్ల క్రితం నాటి తీర్పును ప్రకటించింది. గ్రాడ్యుయేష‌న్ చ‌దువుతున్న‌ ముస్లింలకు 80 శాతం స్కాలర్‌షిప్‌ లు ఇవ్వడం  రాజ్యాంగ విరుద్ధమని కేరళ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పినారయి విజయన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.  ఆరేళ్లనాటి కేసులో ఇప్పుడు తీర్పు ఇవ్వడంతో  కోర్టు తీర్పుపై ముస్లింలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌గా, క్రైస్తవులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. 

కేర‌ళ రాష్ట్ర ప్రభుత్వం 6 సంవత్సరాల క్రితం గ్రాడ్యుయేష‌న్ చ‌దువుతున్న‌ ముస్లింలకు మైనారిటీ పేరిట 80 శాతం స్కాలర్‌షిప్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. మిగిలిన 20 శాతం స్కాలర్‌షిప్ క్రైస్తవులకు ఇస్తున్నారు. ఈ నిర్ణ‌యంపై సీనియ‌ర్ హైకోర్టు న్యాయ‌వాది హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌పై విచారించిన హైకోర్టు  కేర‌ళ ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని తాజా త‌న తీర్పులో త‌ప్పుప‌ట్టింది. ఇలా స్కాల‌ర్‌షిప్ ఇవ్వ‌డం రాజ్యాంగ విరుద్ద‌మ‌ని ప్ర‌క‌టించింది. కేర‌ళ హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి తల‌నొప్పిగా మారింది.

ఈ తీర్పును ప్రధాన న్యాయమూర్తి ఎస్ మణికుమార్, జస్టిస్ షాజీ పీ చెలి ధ‌ర్మాస‌నం వెలువ‌రించింది. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానం ఏమిటి స్పష్టం చేయాలని బిజెపి వత్తిడి తీస్తుండగా, కోర్టు తీర్పు ప్ర‌తి ఇంకా అంద‌లేద‌ని, అందిన త‌ర్వాత పూర్తిగా చ‌దివి అధికారుల‌తో చ‌ర్చించిన మీద‌ట నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అంటూ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కాలయాపన చేస్తున్నారు. 

కేరళలో ముస్లింల అతిపెద్ద సంస్థ అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కోర్టులో వాస్తవాలను సమర్పించడంలో ప్రభుత్వం  విఫలమైందని ఐయూఎంఎల్ ఆరోపిస్తున్న‌ది. 

2011లో వి ఎస్ అచ్యుతానందన్ నేతృత్వంలోని ఎల్ డి ఎఫ్ ప్రభుత్వం ముస్లింలతో పాటు లాటిన్, మతం మారిన క్రైస్తవులను కూడా చేర్చడంతో ఇప్పుడు కోర్టులో చిక్కులు ఏర్పడినట్లు విమర్శిస్తున్నది. కాగా, తీర్పును వెంటనే అమలు చేయాలని క్రైస్తవ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. హైకోర్టు తీర‌పును ప్రభుత్వం అమలు చేసి త‌మ‌కు న్యాయం చేస్తుందని ఆశిస్తున్న‌ట్లు జాకబ్ బిషప్ జోసెఫ్ గ్రెగోరియస్ చెప్పారు.

కోర్ట్ తీర్పు పట్ల ఎల్ డి ఎఫ్ లోని రెండు భాగస్వామ్య పక్షాలు పరస్పరం భిన్నమైన వైఖరి అవలంభిస్తున్నాయని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ తెలిపారు. ఈ విషయంలో సిపిఎం ముఖ్యమంత్రి విజయన్ తమ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ కేసులో ఇదివరలో జోక్యం చేసుకున్న మిజోరాం గవర్నర్ పి ఎస్ శ్రీధరన్ పిళ్ళై హైకోర్టు తీర్పు సంక్షేమ పధకాలను అందరికి సమంగా అందించాలనే రాజ్యాంగ నిబంధనలకు విజయమని హర్షం ప్రకటించారు. కోర్ట్ తీర్పును అందరు ఆ దృష్టితో చూడాలని కోరారు.