తెలుగు దేశంకు సిద్ధాంత పునాదులు ఉంటే గదా!

డా. వడ్డీ విజయసారధి,

 “జాగృతి” మాజీ సంపాదకులు, ప్రముఖ రచయత, సామజిక, రాజకీయ విశ్లేషకులు 

తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే లక్ష్యంతో ప్రారంభింపబడిన పార్టీ తెలుగు దేశం పార్టీ. నాడు కేంద్రం లో అధికారంలో ఉన్న కాంగ్రేసు తెలుగువారిని అవమానిస్తున్నదని, తెలుగువారి బాగోగులగురించి దానికి పట్టింపులేదని, కాబట్టి తెలుగువారి భవితవ్యం తీర్చిదిద్దుకొనడానికి తెలుగువారే సారథ్యం వహించే పార్టీ అవసరమని నందమూరి తారకరామారావు విశ్లేషించారు.
1983లో, మరల 1985లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచి తెదేపా ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. 1989 ఎన్నికల్లో ఓటమి పాలైనా, 1994లో మళ్ళీ విజయం సాధించింది. 1995లో పార్టీ నాయకత్వం రామారావు చేతుల్లోనుండి చంద్రబాబు నాయుడు చేతులలోకి వచ్చింది.
1996లో జరిగిన లోకసభ ఎన్నికల్లో కాంగ్రెసు ద్వితీయ స్థానానికి పరిమితమైంది. భాజపా ప్రథమ స్థానానికి ఎగబ్రాకింది. అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెసు పట్ల వ్యతిరేకత విధానంగా కలిగిన తెదేపా ఆ ప్రభుత్వాన్ని బలపరచలేదు.
 
నిండా ముప్పై స్థానాలులేని జనతా దళ్ (సెక్యులర్) నేత దేవగౌడ ప్రభుత్వం ఏర్పరచ డానికి తెదేపా ముందునిలిచి సహకరించింది. ఆ ప్రభుత్వాన్ని తామే నడుపుతున్నట్లుగా విర్రవీగింది. దానివల్ల తెలుగువారికి ఏమైనా లాభం చేకూరిందా? సూక్ష్మంగా అధ్యయనం చేయవలసిన విషయమిది.
రెండేళ్లుకూడా ఆ కూటమి ప్రభుత్వాలు నిలువలేదు. 1998 లో మరల అటల్ బిహారీ వాజపేయి నేతృత్వం లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. తెదేపా అంశాల వారీ మద్దతు ప్రకటించింది. స్పీకరుగా తమ పార్టీ వ్యక్తిని (అనుభవంలేనివానిని) గెలిపించుకొంది.
 
1999లో లోకసభకు, ఆం.ప్ర. శాసనసభకూ ఏక కాలంలో ఎన్నికలు జరిగాయి. తెదేపా భాజపా కలిసి పోటీచేసి పెద్దసంఖ్యలో స్థానాలను గెలుచుకున్నాయి. ఇప్పుడైనా, తెదేపా ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిందా? చేరలేదు. స్పీకరుగా తమపార్టీకిచెందిన బాలయోగిగారిని మళ్ళీ గెలిపించుకుంది.
2003లో అలిపిరి వద్ద నక్సలైట్ల మందుపాతర దాడి అనంతరం శాసనసభను రద్దుచేసినా, ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళేందుకు భయపడి, భాజపాపై ఒత్తిడి పెట్టి లోకసభ ఎన్నికలుకూడా ముందుకు జరిపించారు. తెదేపా ఘోరంగా ఓడిపోయింది. పొత్తు కుదుర్చుకున్న భాజపా కూడా ఓడిపోయింది.
2009ఎన్నికల్లో తెరాస తోను, 2019ఎన్నికల్లో కాంగ్రెస్ తోనూ పొత్తు పెట్టుకున్నారు. 2000వరకు ఆంధ్రప్రదేశ్ లో తెదేపా ఒకటే ప్రముఖమైన ప్రాంతీయ పార్టీగా ఉండగా, 2000లో తెరాస, 2011లో వైఎస్సార్ కాంగ్రెసుపార్టీలు రంగంలోకి వచ్చాయి. తెరాస తెలంగాణ లో అధికారంలో ఉన్నది. తెదేపా తెలంగాణలో నామమాత్రంగానైనా ఉన్నదో లేదో చెప్పగల స్థితి లేదు. ఆం ప్ర. లో తెదేపాను క్రిందికి త్రోసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారం కైవసం చేసుకొంది.
 
1982 నుంచి నేటి వరకు తెదేపా ప్రస్థానాన్ని పరిశీలిస్తే అవసరాలకనుగుణంగా ఏపార్టీతోనైనా పొత్తు పెట్టు కొంటుంది, లాభపడచూస్తుంది. ఒకానొక పార్టీతో కలవనే కలవము అనేంతగా సైద్ధాంతిక విభేదాలు ఏ పార్టీతోనూ లేవు. (అసలు ఈ పార్టీకి సిద్ధాంత పరమైన పునాదులు ఉంటేగదా!)
 
ఏపార్టీనీ నమ్మి ఉభయులూ లాభపడేలా ప్రవర్తించదు. వాడుకొని వదిలివేయటమే ఈ పార్టీ విధానం. ఈపార్టీ వ్యవహార శైలితో అన్ని పార్టీలకూ తగినంత అనుభవమున్నది. కాబట్టి మళ్లీ పొత్తుపెట్టుకొని అవమానింపబడడానికి ఏపార్టీ గానీ సిద్ధపడటం లేదు. ఇలా ఏకాకిగా మిగిలి పోయిన స్థితిలో ఆత్మపరిశీలన చేసుకోవటం అవసరం.
తాము చేస్తున్నది వ్యాపారమో, క్రీడా నిర్వహణమో అయితే పూర్తిగా దివాలా తీసేవరకు, అలిసిపోయి కుప్పకూలేవరకు వారు తమ డాబు కొనసాగించు కోవచ్చు. అలాగాక తమకేవో సిద్ధాంతాలు, రాజకీయ మైన లక్ష్యాలు ఉన్నవని వారు చెప్పుకో గోరితే ఇప్పుడు కాదుగదా, మరో పాతిక ఏండ్ల గడిచినా అవి నెరవేరే అవకాశంలేదని మొగమాటం లేకుండా చెప్పవచ్చు.
 
రాజకీయ సిద్ధాంత సంబంధమైన లక్ష్యసాధన విషయమై ఈ పార్టీ చిత్తశుద్ధితో పని చేయగలదనే భ్రమలు ఎవరికీ లేవు. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ఒక క్షణం తెదేపా లక్షణం వ్యాపారమో, ద్యూతక్రీడో (జూదమో) అనుకొని ఆలోచించి చూద్దాం. తెలివైనవారు తాము ఎప్పుడు విరమించుకోవాలో తెలిసినవారై మంచి పేరుతో, ఏదో ఒక మేరకు లాభాలలో ఉండగానే ఆ వ్యాపారం నుండి, క్రీడా నుండి విరమించుకుంటారు. అలా కాదని మొండిగా కొనసాగినవారు సమస్తమూ కోల్పోతారు.
 
నిన్నటి సమర్థకులు అనుకున్న వారి నుండి కూడా భరించ శక్యం కాని వ్యాఖ్యలను ఎదుర్కోవలసి వస్తుంది. తమ వ్యక్తిగతమైన ఎదుగుదలకు ఈ పార్టీ ప్రతిబంధకంగా ఉందని వారు నిందిస్తారు. చరిత్రలో ఈ విధంగా నిలిచిపోవాలో ఆలోచించుకొని నిర్ణయించుకో వేసిన మలుపులో ఈనాడు తెదేపా ఉన్నదని గ్రహించుకొని సత్వర నిర్ణయం గైకొనడం శ్రేయోదాయకం.