రాబందుల రాజకీయాలు!

 —  గిరిధర్ మామిడి

చైనీస్ కరోనా వైరస్ తీక్షణ రెండవదశ భారత్ లో ఏప్రిల్ 2021నుండి ఉధృతంగా శరవేగంగా వ్యాపిస్తోంది. దేశం ఎన్నడూ చూడని విధంగా, మొదటిదశ కన్నా తీవ్రంగా ఎన్నోరెట్లు మరణాల రేటు పెరుగుతోంది. మొదటిదశలో కరోనా మహమ్మారిపై భారత్ దాదాపు విజయం సాధించగా, ఇప్పుడు వ్యాపిస్తున్న ఈ రెండవ దశలో, ప్రతి రోజు లక్షలమంది వ్యాధికి గురవడంతో పాటు, ఈ ఉధృతికి వైద్య-ఆరోగ్య రంగం తట్టుకోలేని విధంగా దెబ్బతింది.

రోగులకి కావలసిన పడకలు, మందులు, ఆక్సిజన్, అంబులెన్స్లు, ఇతర పరికరాలు, సదుపాయాలు, లక్షలమందికి సరిపడా లేక వైద్యరంగం అస్తవ్యస్తమైంది. ఇన్ని కోట్లమంది ఒకేసారి వ్యాధి బారినపడితే, బహుశా ప్రపంచంలో ఏ దేశమూ తట్టుకోలేదు. రెండవదశ విషయంలో భారతప్రభుత్వం, చాలా రాష్ట్రప్రభుత్వాలకి సలహాలు, సూచనలు జారీ చేసినా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యరంగం సామర్థ్యo  పెంచడంలో విఫలమైయాయి.

మార్చ్2021లో దేశవ్యాప్తంగా 1,50,000 మాత్రమే ఉన్న కేసుల సంఖ్య, మూడు వారాల్లోనే రోజుకి 3,50,000 సంఖ్య చేరుకుంది. వైద్యరంగ నిపుణులు ఈ కొత్త రకం `మ్యుటేషన్లు’ ఇంకా అధ్యయనం చేస్తున్నా, ఇది వ్యాప్తి చెందుతున్న తీవ్రతను బట్టి ఇవి చాలా ప్రమాదకరమైనవిగా గుర్తిస్తున్నారు.

ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు లక్షలాది రోగులకి సేవలందించలేకపోతున్న ఈ సమయంలో, ఎందరో మరణాలకి గురి ఆవుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు లేక, హాస్పిటళ్ళలో పడకలు, ఇతర సదుపాయాలు లేక, ప్రాణాలు కాపాడే ఇంజెక్షన్లు మందులు లేక ఎంతోమంది మరణించారు. మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయిన సమయంలో ఎటునుంచి ఏ సమాధానాలు లేవు. విషాదంలో మునిగిపోయిన కుటుంబాలని మరింత వ్యధకి లోనుచేస్తూ, స్మశానాలలో దహనాలకి, ఖననాలకి స్థలం దొరకక ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది.

ప్రతి విషాదాన్ని, ప్రతి మరణాన్ని, బాధితుల దుఃఖాన్ని, తమ స్వప్రయోజనాలకి వాడుకునే రాబందులు చాలామందే ఈ దేశంలో ఉండడం దురదృష్టం. హాస్పిటల్ పడకల నుంచి, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఎన్నో ఇతర పరికరాలు వరకు బ్లాక్ లో అమ్ముకోవడమేకాక, మరణించిన వారి శవాలను శ్మశానవాటికలకు తీసుకెళ్ళడానికి కూడా విపరీతమైన సొమ్ము చేసుకుంటున్న వారున్నారు.

ఈ కరోనా మహమ్మారి రెండవదశలో, ఈ రాబందులు ప్రతి విషాదాన్ని తమ స్వార్థానికి సొమ్ము చేసుకోవడమేకాక, మానవత్వం సిగ్గుపడే రాజకీయాలు ఎన్నో చేసారు.

రాజకీయ రాబందులు

భారత రాజ్యాంగం ప్రకారం `ప్రజారోగ్యం’ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుంది. క్రిందటి సంవత్సరం కరోనా మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం, ఈ మహమ్మారిని నిలిపేందుకు కేంద్రస్థాయిలో అన్ని నిర్ణయాలు తీసుకుంది-దేశవ్యాప్తంగా లాక్డౌన్, పేద శ్రామిక ప్రజానీకానికి ఆహార మరియు ఆర్ధిక తోడ్పాటు మొదలైన అన్ని అంశాలు భారత ప్రభుత్వమే చూసుకుంది. అప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కాలరాస్తోందని, ఇది సమాఖ్యవాద స్ఫూర్తికి విరుద్ధమని రాద్ధాంతం చేసాయి.

మొదటిదశ సమయంలో, పరిస్థితిని అదుపులోకి తెచ్చి, కరోనాపై దాదాపు విజయం సాధించి, ఆర్థిక వ్యవస్థని కూడా నియంత్రణలోకి తెచ్చింది భారత ప్రభుత్వం. ప్రపంచంలో అతి కొద్ది దేశాలు మాత్రమే ఈ విధంగా చేయగలిగాయి. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం, కరోనాపై యుద్ధాన్ని కొనసాగించాలని, దానికి తగిన నిర్ణయాధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పచెప్పింది.

బ్రిటన్, బ్రజిల్ దేశాలలో వైరస్ `మ్యుటేషన్లు’ జరిగినప్పుడు, `ప్రపంచ ఆరోగ్య సంస్థ’ WHO, మరింత ప్రమాదకారి అయిన రెండవదశ రావచ్చని హెచ్చరించింది. కరోనాతో బాగా దెబ్బతిన్న రాష్ట్రాలకు కేంద్రం ఈ సూచనలు, కార్యాచరణ ప్రణాళిక  పంపించింది. అయితే ప్రమాదకరమైన రెండవదశ వచ్చేనాటికి ఏ రాష్ట్రప్రభుత్వం, దీనికి సిధ్ధపడలేదు. లాక్డౌన్ తొలగింపు నుంచి- రెండవదశవరకు ఉన్న సమయాన్ని ఏ రాష్ట్రమూ తమ వైద్యరంగ శక్తిసామర్థ్యాలు పెంచుకోవడానికి కావలసిన- హాస్పిటల్ పడకలు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆక్సిజన్ప-వెంటిలేటర్ల వంటి పరికరాలు, మొదలైన ఏ చర్యలూ తీసుకోలేదు.

ఈ ప్రమాదస్థితిలో కేంద్రం మరియు ఇతర రాష్ట్రప్రభుత్వాలతో సహకార సమన్వయము చేసుకోకుండా తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోడానికి, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రప్రభుత్వాలు, ఈ విషాదాన్ని రాజకీయం చేసి, ఈ మొత్తం వైఫల్యాన్ని మోదీ ప్రభుత్వానికి అంటగట్టాలని అన్నిరకాల ప్రయత్నాలు చేసాయి.

రెండవ దశలో `సూపర్-స్ప్రెడర్’గా ఈ మహమ్మారి అన్ని రాష్ట్రాలకు వ్యాపించడానికి కారణమైన మహారాష్ట్ర రాష్ట్రప్రభుత్వం, `డబ్బు వసూల్’ చేసుకుంటూ, నటి కంగణా రనావత్ ఇల్లు కూల్చేయడంలో, పాత్రికేయుడు అర్నవ్ గోస్వామిని జైల్లో పెట్టడంలో తలమునకలైఉండి, కరోనా గురించి పట్టించుకోలేదు. ఒకదశలో 35%శాతం కేసులు కేవలం మహారాష్ట్రలో నమోదయాయి, అసంఖ్యాకంగా రోగులు మరణించారు. ఈ విషాదానికి వైఫల్యాలకి బాధ్యత తీసుకోకుండా, మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేసి, రాబందు రాజకీయాలతో  తప్పించుకోవాలని ప్రయత్నించింది.

`వ్యవసాయ చట్టాల’కి వ్యతిరేకంగా, రాజధాని ఢిల్లీని నలువైపులా దిగ్బంధనం చేసి రైతులుగా చలామణి అవుతున్న దళారులకి బిర్యానీ, ఇంటర్నెట్ సరఫరా చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ప్రతి టీవీ ఛానల్, వార్తాపత్రికలలో, సోషల్ మీడియాలో `కరోనా కట్టడి’పై విపరీతంగా సొంత ప్రచారం బాగా చేసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గత 6సంవత్సరాలలో ఒక్క ఆసుపత్రి కూడా కట్టించలేదు,

మొహల్లా క్లినిక్స్ అని చెప్పబడే క్లినిక్స్ కరోనా యుద్ధంలో  ఎక్కడా మచ్చుకైనా కనిపించలేదు. ఆయన పార్టీ ఎమెఎల్ఏ 600పైగా ఆక్సిజన్ సిలిండర్లు కేవలం మైనారిటీ వర్గం కోసం అక్రమంగా నిలవచేశాడు, ఇవి బయటకి వచ్చి ఉంటే ఎన్నో ప్రాణాలు నిలబడేవి. ఆప్ పార్టీ ఘరానా మిత్రులు మందులు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ కనిపించారు. ప్రధానమంత్రితో జరిగిన ఒక ప్రైవేటు సమావేశం, అందులో కేజ్రివాల్ ప్రధానిని ఆక్సిజెన్ కోసం ప్రాధేయపడుతున్న వీడియో బయటపెట్టి, తద్వారా ప్రధాని ఎంత నిర్దయుడో చూపించే ప్రయత్నం చేసారు ఢిల్లీ ముఖ్యమంత్రి. ఢిల్లీ హైకోర్టులో కూడా ఇదే విధంగా కేంద్రం ఆక్సిజెన్ సరఫరా చేయట్లేదని ప్రకటించి భయాందోళనలు కలిగించారు,

కోర్టు వెంటనే కేంద్రానికి `కంటెంప్ట్’ నోటిసు జారీచేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం, అప్పటికే సరఫరా అయిన ఆక్సిజెన్ వినియోగంపై `ఆడిట్’ జరిపించాలని చెప్తే, వీల్లేదని ఢిల్లీ ప్రభుత్వం తప్పించుకుంది. తన తప్పిదాలని, వైఫల్యాలని, కేంద్రప్రభుత్వంపై రుద్దడానికి కేజ్రివాల్ ఎంత ప్రయత్నించారో స్పష్టమౌతుంది. ఏకంగా కోర్టులని, మీడియాని కూడా ఆయన కొనేయాలని చూసారు.

కేవలం టీవీ, పత్రికా ప్రకటనలపై దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేసారు, అలాగే కేంద్రప్రభుత్వ ఆధీనంలోని ఒక ప్రసిద్ధ 5-స్టార్ హోటల్ని హైకోర్టు న్యాయాధిపతులు, ఇతర సిబ్బంది కోసం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రధాని కోవిడ్ కార్యక్రమాల సమీక్షకై జరిపిన సమావేశం గురించి వ్యతిరేకంగా ట్వీట్ చేస్తూ తన అసమర్థతని ప్రధాని మీదకు నెట్టేయడానికి చూసారు ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.

 

మీడియా రాబందులు

ఈ భయంకర మహమ్మారి నీడలో తప్పనిసరిగా ఎన్నో విషాదగాథలు ఉంటాయి; కుల, మత, జాతి, ప్రాంత, లింగ, వయసు వివక్ష లేకుండా పెద్దా చిన్నా, పేదా గొప్ప, స్త్రీ పురుషులు పిల్లలు అనే బేధం లేకుండా ఈ మహమ్మారి ఎందరినో విగత జీవులను చేసింది. అయితే కొందరు మీడియా రాబందులు మాత్రం ప్రత్యేకంగా కొన్ని వార్తా కథనాలను మాత్రమే ఎంచుకుని, వాటిని అంతర్జాతీయంగా ప్రచారం చేసి దేశ ప్రతిష్టను దిగజార్చారు.

ప్రభుత్వంపై చేయవలసిన నిర్మాణాత్మక విమర్శలకి, దేశానికి/దేశ సంస్కృతికి వ్యతిరేకంగా చేసే కథనాలకి వారికి తేడా తెలియకుండాపోయింది. మరణించిన వారికి స్మశానంలో జరిగిన దహనాలను చిత్రీకరించిన వీడియోలు, చిత్రాలను, పాశ్చాత్య దేశాల పత్రికలకు వీరు ఖరీదుకట్టి ఆన్లైన్లో అమ్ముకున్నారు. చనిపోయాక జరిగే అంతిమ సంస్కారం కూడా వదలకుండా, ఆయా వ్యక్తుల విలువ, గౌరవాలకి భంగం కలిగించే ఫోటోలు వీడియోలు అమ్ముకుని లక్షలు గడించారు మీడియా రాబందులు.

ఒక వరిష్ట పాత్రికేయురాలు, స్మశానంలో దహనాలు జరిగే చోట కూచుని, ఆవిడ తన కథనాన్ని ప్రపంచానికి చెప్పింది. వారి సిద్ధాంతాలను సమర్థిoచని కారణంగా, ఒక యువ పాత్రికేయుడు రోహిత్ సర్దానా కరోనాతో మరణిస్తే, సంతాపం తెలియచేయడం బదులుగా, మీడియా రాబందులు అతన్ని దూషించి అపహాస్యం చేసారు. వీరందరూ ఎంతో కలిసికట్టుగా అనుకుని ఒకేసారి వారి ట్విట్టర్ నుంచి ట్వీట్స్ చేస్తుంటారు.

ఈ మీడియా రాబందులు మోదీ ప్రభుత్వoపై మాత్రమే ఆరోపణలు చేస్తుంటారు, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల గురించి అసలు మాట్లాడరు. ఒకసారి వీరు, మహారాష్ట్ర ఉద్ధవ్ థాకరే, ఢిల్లీ అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వాల పనితీరును పొగుడుతూ, వీరిని చూసి మోది ప్రభుత్వం నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. మహారాష్ట్రలో 7 ఆసుపత్రులలో అగ్నిప్రమాదాలు జరిగి, ఎంతోమంది కరోనా రోగులు మరణించారు.

కాని ఈ మీడియా రాబందులు ఈ మరణాలపై మహారాష్ట్ర ప్రభుత్వ జవాబుదారీతనం గురించి కథనాలు వ్రాయలేదు. ఈ రోజు వాక్సిన్ల విషయంలో మోది ప్రభుత్వం విఫలమైంది అని మాట్లాడుతున్న ఈ మీడియా రాబందులు, క్రిందటి సంవత్సరం ఇదే వాక్సిన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసారు, ముఖ్యంగా భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన `కోవాక్సిన్’ గురించి. ప్రతి రోజు లక్షలాదిమంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు అని చెప్పే మీడియా, ప్రతి రోజు లక్షలాదిమంది ఆరోగ్యవంతులై హాస్పిటళ్ళనుంచి తిరిగి వెళుతున్నారు అని చెప్పదు. కేవలం మోది ప్రభుత్వం మీద ద్వేషంతో ప్రవర్తించే ఈ మీడియా రాబందులు, అసలైన నేరస్థులను విడిచిపెట్టి, వారి తప్పుడు కథనాలతో, భారతదేశ ప్రతిష్టను ప్రపంచం ముందు దిగజారుస్తున్నారు.

ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఈ మహమ్మారిని అంతం చేయడానికి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, సామాన్య భారతీయ పౌరులు ఈ రాజకీయ-మీడియా రాబందుల భారత-వ్యతిరేక విషకథనాల వలలో పడకుండా, ప్రజలంతా ఒక్కటై కరోనాపై జరిగే యుద్ధంలో తమవంతు కృషి చేయాలి.