వైరస్ చైనా ల్యాబ్‌లోనే కృత్రిమంగా పుట్టిందే!

వైరస్ చైనా ల్యాబ్‌లోనే కృత్రిమంగా పుట్టిందే!

కొవిడ్19 వైరస్‌కు సహజ పూర్వీకులు(నేచురల్ యాన్సెస్టర్స్) లేరని, కరోనా కచ్చితంగా ల్యాబ్‌లో తయారుచేసిన కృత్రిమ వైరసే అనేందుకు తమ వద్ద బలమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని ఇద్దరు యూరోపియన్‌ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 

2002 నుంచి 2019 సంవత్సరం నవంబరు నెలాఖరు వరకు వూహాన్‌ ల్యాబ్‌లో వైర్‌సలపై జరిగిన పరిశోధనల వివరాలు, అక్కడ సంభవించిన సంఘటనల విశ్లేషణ ఆధారంగానే ఈ నిర్ధారణకు వచ్చామని ప్రముఖ శాస్త్రవేత్తలు బిర్గర్‌ సోరెన్సన్‌ (నార్వే), అంగుస్‌ దల్‌గ్లీష్‌ (బ్రిటన్‌) అంటున్నారు. 

ఇంతటి సంచలన విషయాలను బ్రిటన్‌కు చెందిన ‘డైలీ మెయిల్‌’ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వారు వెల్లడించారు. ఈమేరకు వివరాలతో తాము రూపొందించిన 22 పేజీల పరిశోధనా పత్రం ‘క్వార్టర్లీ రివ్యూ ఆఫ్‌ బయో ఫిజిక్స్‌ డిస్కవరీ’ (క్యూఆర్‌బీ- డిస్కవరీ) జర్నల్‌లో త్వరలోనే ప్రచురితం కానుందని తెలిపారు. 

కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే క్రమంలో వైర్‌సపై అధ్యయనం చేస్తుండగా బిర్గర్‌ సోరెన్సన్‌, అంగుస్‌ దల్‌గ్లీ‌ష్‌లు ఒక ఆశ్చర్యకరమైన అంశాన్ని గుర్తించారు. వైర్‌సలోని అమైనో యాసిడ్ల అమరిక చాలా భిన్నంగా ఉండటాన్ని చూసి.. అది కృత్రిమ వైరసేనేమో అనే సందేహం వారిలో పెరిగింది. 

దాన్ని నివృత్తి చేసుకునే క్రమంలోనే వారు 2002 నుంచి 2019 వరకు వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌లో వైర్‌సలపై జరిగిన పరిశోధనల వివరాలను సేకరించారు. వాటిని కూలంకషంగా అధ్యయనం చేశారు. చైనా శాస్త్రవేత్తలు తమ దేశంలోని గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్ మూలాల్ని తీసుకొని, అందులోకి స్పైక్ ప్రోటీన్‌ను చొప్పించారని పరిశోధకులు పేర్కొన్నారు.

అది 2019 సంవత్సరం నవంబరు నెల. చైనాలోని వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో పనిచేసే ముగ్గురు శాస్త్రవేత్తలు అస్వస్థతకు గురవడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. అందుకు గల కారణాలను చెప్పడానికి చైనా ప్రభుత్వం నిరాకరించింది. 

కచ్చితంగా ఆ సమయంలోనే ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీకై ఉండొచ్చని  బిర్గర్‌ సోరెన్సన్‌, అంగుస్‌ దల్‌గ్లీ‌ష్‌లు అంచనా వేశారు. ఈ ఘటనకు సంబంధించిన పలు ఆధారాలతో ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ ఇటీవల కథనాన్ని ప్రచురించిన విషయాన్ని గుర్తుచేశారు.  వైరస్ వేగంగా వ్యాప్తి చెందేలా రూపొందించారని వారు తెలిపారు. కొవిడ్19 రూపురేఖలు ప్రత్యేకంగా ఉన్నందున ఈ వైరస్ ల్యాబ్‌లోనే తయారై ఉంటుందని వారు స్పష్టం చేశారు.

ఈ వైరస్ వెలుగు చూడటానికి ఏడాది క్రితం నుంచే వుహాన్‌లోని ల్యాబ్‌లో గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పేరుతో రివర్స్ ఇంజినీరింగ్ పరిశోధనలు జరగడమే అందుకు ప్రాథమిక సాక్షమని వారు స్పష్టం చేశారు.  ల్యాబ్‌లో జరిగిన పరిశోధనల వివరాల్ని దాచి పెట్టడం, వాటిని బహిర్గతపరుస్తారని అనుమానించిన శాస్త్రవేత్తల్ని కనిపించకుండా చేయడం కూడా బలం చేకూర్చే సాక్షమేనని వారు గుర్తు చేశారు.

చైనా సైన్యంతో లింక్!

ఇలా ఉండగా, వుహాన్ వైరాల‌జీ ల్యాబ్‌లో ప‌రిశోధ‌న‌ల‌తో పాటు ఆ దేశ సైన్యం కూడా ల్యాబ్ ప‌రీక్ష‌ల్లో నిమ‌గ్న‌మైన‌ట్లు బ్రిటన్ మాజీ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన సైనికులు ఆ ల్యాబ్ ప‌రీక్ష‌లో భాగ‌స్వామ్యుల‌య్యార‌ని, వైర‌స్ ప‌రిశోధ‌న‌ల‌తో పాటు సైనిక కార్య‌క‌లాపాలు కూడా నిగూఢంగా సాగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 

ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పీఎల్ఏ సైన్యంతో వాళ్లు ఆ ల్యాబ్‌లో ఏం చేశారో చెప్ప‌డానికి ఇష్టంగా లేర‌ని, అస‌లు ఎలాంటి ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయో కూడా చెప్ప‌డం లేద‌ని ధ్వజమెత్తారు. ఆ ల్యాబ్‌కు వెళ్లేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు కూడా అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని పాంపియో గుర్తు చేశారు.