ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రానే అస‌లైన‌ స‌వాల్‌

దేశంలో క‌రోనా ఫ‌స్ట్‌వేవ్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నామ‌ని, కానీ సెకండ్ వేవ్ సంద‌ర్భంగా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా ప్ర‌ధాన స‌వాల్‌గా మారింద‌ని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అయితే ఆ సవాల్ ను ఎదుర్కొని, ఇప్పుడు పది రేట్లు ఎక్కువగా ఆక్సిజన్ ఇక్కడనే ఉత్పత్తి చేసుకొంటున్నామని చెప్పారు. 

మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆదివారం ఆకాశవాణిలో మాట్లాడిన ప్ర‌ధాని  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను నిలుపడానికి అవసరమైన ఆక్సిజన్‌ను తరలించడంలో లోకో పైలెట్లు, వైమానిక దళ పైలెట్లు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని ప్ర‌ధాని కొనియాడారు.

విదేశాల నుంచి ఆక్సిజన్ కంటెయినర్లను తరలించడంలో వాయుసేన కీలకపాత్ర పోషిస్తున్న‌దని చెప్పారు. అనంతరం వాటిని దేశవ్యాప్తంగా అవసరమైన నగరాలకు తీసుకెళ్లడంలో రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళా లోకో పైలెట్ శిరీషతో మాట్లాడుతూ ఆమె అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. 

కరోనా మహమ్మారి లాంటి సంక్షోభాలు వందేళ్లకోసారి వ‌స్తుంటాయ‌ని, అలాంటి సంక్షోభాల‌ను ఎదుర్కోవ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంద‌ని ప్ర‌ధాని తెలిపారు. అయినప్పటికీ దేశ ప్రజలు కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటున్నారని ప్ర‌ధాని చెప్పారు. ఇదివరకు ఎప్పుడూ తెలియ‌ని సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డంలో ప్ర‌జ‌లు వెన్ను చూపడంలేద‌ని అభినందించారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో పాల్గొంటున్న‌ ల్యాబ్ టెక్నీషియన్లను కూడా ప్రధాని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా రోజూ 20 లక్షలకుపైగా కరోనా టెస్టులు చేస్తున్నార‌ని, ఇందులో ల్యాబ్ టెక్నీషియన్‌ల‌ పాత్ర కీలకమని ప్ర‌ధాని కొనియాడారు.

భార‌త్ ఇత‌ర దేశాల ఒత్తిడిల‌కు లోబ‌డి లేద‌ని, స్వీయ సంక‌ల్పంతోనే ముందుకు న‌డుస్తున్న‌ద‌ని స్పష్టం చేశారు. త‌మ ప్రభుత్వం ఏడు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న‌ద‌ని చెబుతూ కొన్నేళ్లుగా దేశం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా-విశ్వాస్’ అనే మంత్రంతో నడుస్తున్న‌ద‌ని పేర్కొన్నారు.

 గ‌డ‌చిన ఈ ఏడు సంవత్సరాలలో సాధించిన విజయాలు దేశానివ‌ని, దేశ ప్రజలవ‌ని మోదీ స్పష్టం చేశారు.  జాతీయ భద్రతా సమస్యలపై భారత్ రాజీపడబోద‌ని, మన త్రివిధ దళాల బలం పెరిగింద‌ని, ఈ కార‌ణంగానే దేశం సరైన మార్గంలో ఉంది భావిస్తున్నామ‌ని ప్ర‌ధాని మోదీ చెప్పారు.