మెహుల్ చోక్సీ కోసం ప్రత్యేక విమానం పంపిన భారత్ 

బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత దేశానికి రప్పించడం కోసం ఒక ప్రత్యేక విమానంను డొమినాకు భారత్ పంపించింది. ఆయనపై భారత దేశంలో కేసులు ఉన్నట్లు రుజువు చేయడానికి అవసరమైన పత్రాలను పంపింది. 

ఈ విషయాన్ని ఆంటిగ్వా-బార్బుడా ప్రధాన మంత్రి గస్టన్ బ్రౌనే ఆదివారం ధ్రువీకరించారు. ఆంటిగ్వా మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, బొంబార్డియర్ గ్లోబల్ 5000 కతార్ ఎగ్జిక్యూటివ్ విమానం డొమినికాలోని డగ్లస్ చార్లెస్ విమనాశ్రయంలో శనివారం దిగింది. ఈ విమానం బొమ్మను కూడా స్థానిక మీడియా పోస్ట్ చేసింది.

ప్రధాన మంత్రి బ్రౌనే ఓ ఎఫ్ఎం రేడియో చానల్‌తో మాట్లాడుతూ, ఈ విమానం డొమినికాకు వెళ్ళడాన్ని ధ్రువీకరించారు. మెహుల్ చోక్సీపై భారత దేశ న్యాయస్థానాల్లో కేసులు ఉన్నట్లు ధ్రువీకరించేందుకు అవసరమైన పత్రాలను భారత ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోందని తెలిపారు. 

చోక్సీ పారిపోయి వచ్చినట్లు రుజువు చేయడానికి స్థానిక కోర్టులో ఈ పత్రాలను సమర్పిస్తుందని తెలిపారు. చోక్సీ డిపోర్టేషన్‌ను డొమినికా జడ్జి బుధవారం వరకు నిలుపుదల చేసిన సంగతిని గుర్తు చేశారు. చోక్సీని తీసుకెళ్ళడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. 

డొమినికన్ మీడియా శనివారం ప్రచురించిన ఓ ఫొటోలో కనిపిస్తున్నదాని ప్రకారం, చోక్సీ కటకటాల వెనుక ఉన్నారు. ఆయన ఎడమ కంటికి గాయం కనిపిస్తోంది. ఆయన చేతులు వాచిపోయినట్లు కనిపిస్తున్నాయి. మే 23 సాయంత్రం నుంచి ఆయన అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ప్రచురితమైన ఆయన ఫొటోలు ఇవే. ఆయనను డొమినికా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారు. 

ఇదిలావుండగా మెహుల్ చోక్సీని భారత దేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ విషయంపై డొమినికా ప్రభుత్వంతో మన దేశంలోని అనేక దర్యాప్తు సంస్థలు నిరంతరం మంతనాలు జరుపుతున్నాయి. చోక్సీ అసలు భారతీయ పౌరుడని, భారత దేశంలోని చట్టాల నుంచి తప్పించుకునేందుకు కొత్తగా వేరొక దేశం పౌరసత్వం తీసుకున్నారని డొమినికాకు తెలియజేశాయి. ఆయన భారీ కుంభకోణానికి పాల్పడినట్లు వివరించాయి. 

చోక్సీని తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం తెర వెనుక మార్గాలు, దౌత్య మార్గాలను కూడా ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. చోక్సీని ఫ్యూజిటివ్ ఇండియన్ సిటిజన్‌గా పరిగణించాలని డొమినికాకు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఆయనపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ అయిన విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. 

ఆయనను భారత దేశ అధికారులకు అప్పగించాలని కోరినట్లు తెలుస్తోంది. ప్రజాధనాన్ని కొల్లగొట్టినందుకు ఆయన భారతీయ చట్టాలను ఎదుర్కొనాలని స్పష్టం చేసినట్లు చెప్తున్నారు. చోక్సీని నేరుగా భారత దేశానికి అప్పగించాలని డొమినికాను ఆంటిగ్వా కూడా కోరింది. రెండు రోజుల క్రితం డొమినికా ఇచ్చిన ప్రకటనలో చోక్సీని ఆంటిగ్వాకు అప్పగిస్తామని తెలిపింది. ఓ భారతీయ వార్తా సంస్థతో ఆంటిగ్వా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, చోక్సీని తిరిగి ఆంటిగ్వాలోకి ప్రవేశించనివ్వబోమని స్పష్టం చేశారు. ఆయన చట్టవిరుద్ధంగా డొమినికాలో ప్రవేశించి, పట్టుబడ్డారని చెప్పారు.