హనుమ జన్మస్థలం తిరుమలే: టిటిడి 

అనేక పురాణాలు, కావ్య ఇతిహాసాల ప్రమాణాలను అనుసరించి హనుమంతుని జన్మస్థానం తిరుమలేనని టీటీడీ పండితుల కమిటీ అధ్యక్షులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ స్పష్టం చేశారు. 

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మీడియా సమావేశంలో ఆచార్య మురళీధర శర్మ మాట్లాడుతూ హనుమ జన్మస్థానం తిరుమల కాదని, పంపా నదీ తీరంలో ఉన్న “అంజనహళ్లి”గా క‌ర్ణాట‌క రాష్ట్రం అనెగొందిలోని శ్రీ హ‌నుమ‌ద్ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్టు వ్య‌వ‌స్థాప‌క ధ‌ర్మ‌క‌ర్త‌ శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి పేర్కొంటున్నారని చెప్పారు.

ఈ విషయాన్ని చర్చించడానికి గోవిందానంద సరస్వతి స్వామివారిని గురువారం ఉదయం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి ఆహ్వానించామని పేర్కొన్నారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ చర్చలకు కుప్పా విశ్వనాథశర్మ న్యాయనిర్ణేతగా వ్యవహరించినట్టు చెప్పారు.

హనుమంతుని జన్మస్థలం కన్నా తిరుమలకు ఉన్న పేర్లను, హనుమంతుని జననకాలం గురించే శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి విశ్లేషించారని వివరించారు. పైగా పురాణాలు సమన్వయం కావడం లేదని అభిప్రాయపడ్డారని తెలిపారు. శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి వాదాన్ని ప్రమాణాల ప్రకారం ఖండించినట్టు చెప్పారు. 

అంతేగాక వారి వాదనలో ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని వివరించారు. పురాణాలు భారతీయ సంస్కృతికి మూలమైనవిగా అంగీకరించాలని కోరామని తెలిపారు. అంతేగాక ఉత్తరాలతో టిటిడిని చులకన చేయవద్దని స్వామిజీకి విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు.

‘‘టిటిడి ఇచ్చిన ఆధారాలలో ఏ ఒక్కటి తప్పని నిరూపించలేకపోయారు. గోవిందానంద సరస్వతి ఆధారాలు లేకుండా ఇష్టానుసారం మాట్లాడారు.కుప్ప విశ్వనాథశర్మ మధ్యవర్తిగా శాస్త్ర చర్చ జరిగింది… గోవిందానంద స్వామి వితండవాదం చేస్తున్నారు’’ అని మురళీధర శర్మ స్పష్టం చేశారు.

ఉభయపక్షాల వాదనలను ఆసాంతం విన్న శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ టీటీడీ కమిటీ నిర్ణయం సముచితమని, శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి వాదనలో పస లేదని తేల్చి చెప్పారని తెలియజేశారు. మీడియా సమావేశంలో టిటిడి పండితుల కమిటీ సభ్యులు ఆచార్య రామకృష్ణ, ఆచార్య శంకర నారాయణ, ఆచార్య రాణి సదాశివమూర్తి, కన్వీనర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ పాల్గొన్నారు.

కాగా, హనుమంతుడి జన్మస్థలం తిరుపతిలోని అంజనాద్రే అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ప్రకటించండంపై గోవిందానంద సరస్వతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై  ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చెప్పిన విషయాల్లో ప్రామాణికం లేదని కొట్టిపారేశారు. 

‘‘కాలం విషయంలో టీటీడీకి క్లారిటీ లేదు. మూడు తిధులు రాశారు. జన్మ తేదీ లేనప్పుడు స్థలం ఎలా స్థిరీకరిస్తారు?.. హనుమంతుడు జన్మ విషయంలో పురణాలతో తేల్చలేము. హనుమంతుడి జన్మ స్థల నిర్ణయంలో శంకరాచార్యులను టీటీడీ అడిగిందా?  కనీసం తిరుమల పెద్ద జీయర్‌ను అడిగారా?” అని ప్రశ్నించారు. 

“రామాయణంలో జన్మ స్థలం పంపా అని ఉంది. పురాణం ప్రమాణం కాదు, రామాయణాన్ని టీటీడీ ప్రమాణంగా తీసుకోవాలి. చర్చను బహిరంగంగా పెట్టాలి, ఎందుకు పెట్టలేదు? పంపాకు కమిటీ వచ్చిందా?’’ అంటూ నిలదీశారు. పీఠాధిపతుల సమక్షంలో నిర్ణయం జరగాలని సూచించారు. ఎవరు పడితే వారు కమిటీలు వేసి గంభీర విషయాల్లో నిర్ణయం చేయకూడదని హితవు చెప్పారు.