కొవిడ్ నివారణ మందు తయారీకి అవసరమైన పదార్థాలతో పాటు ఫార్ములా చెప్పాలని అధికారులు వేధిస్తున్నారని ఆనందయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరారు.
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నానని పేర్కొంటూ ఈ కార్యక్రమానికి రక్షణ కల్పించేలా ఆదేశించాలని అభ్యర్ధించారు. లోకాయుక్త ఆదేశాల మేరకు మందు విషయంలో వాస్తవాలు తేల్చేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ త్రిసభ్య కమిటీ వేశారు. కమిటీ ఆయుష్ కమిషనర్‌తో వచ్చి నమూనాలు సేకరించిందని గుర్తు చేశారు.
మందుపై ప్రజలు ఎవరూ నెగెటివ్‌గా చెప్పడం లేదని నివేదికలో పేర్కొన్నారు. మందు తయారీకి వాడే ఫార్ములా చెప్పాలని త్రిసభ్య కమిటీ సభ్యులతో పాటు ఆయుష్ కమిషనర్ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో భారీగా ఖర్చు చేయలేని సామాన్య ప్రజలను తన మందు ఆకర్షించిందని చెప్పారు.
” ప్రస్తుతం నేను మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నాను. అయితే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, అధికార యంత్రాంగం కలిసి దీన్ని కమర్షియలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. “అధికరణ 301 ప్రకారం స్వేచ్ఛాయిత వృత్తి, వాణిజ్యం నిర్వహించుకోవచ్చు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని నా ఆయుర్వేద వృత్తిలో అధికారుల జోక్యాన్ని నిలువరించండి’’ అని ఆనందయ్య కోరారు.
కాగా, ఆనందయ్య మందు పంపిణీపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మందుకు సంబంధించి 29న ఆయుష్ శాఖ నుంచి నివేదిక వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెబుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ డి.సురేశ్, జస్టిస్. కె.సురేశ్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
పరిశోధనలు వేగవంతం చేయాలి
ఇలా ఉండగా, ఆనందయ్య మందుపై పరిశోధనలు వేగవంతం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆదేశించారు. ఈ మందుపై పరిశోధనల పురోగతిపై ఆయన కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కిరణ్ రిజిజుతోనూ, భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) సంచాలకులు బలరాం భార్గవ్‌తోనూ ఫోన్‌లో మాట్లాడారు.
జన బాహుళ్యానికి చెందిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అన్ని కోణాల నుంచి పరిశోధన చేయవలసి ఉంటుందని అందువల్ల కాస్త సమయం పడుతోందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న కేంద్ర ఆయుర్వేద శాస్త్ర పరిశోధన మండలి (సిసిఆర్‌ఎఎస్) ఆధ్వర్యంలో ఏపి ఆయుష్ విభాగం వారి సహకారంతో ఆనందయ్య మందును ఇప్పటికే వాడిన 500 మంది నుంచి వివరాలు సేకరించి పరిశోధన జరుపుతున్నామని రిజిజు తెలిపారు.
రిజిజుతో మాట్లాడిన అనంతరం వెంకయ్యనాయుడు ఐసిఎంఆర్ సంచాలకులు ప్రొఫెసర్ బలరాం భార్గవ్ తోనూ ఫోన్‌లో మాట్లాడారు. ఆనందయ్య మందు ఆయుష్ పరిధిలో వస్తుందనీ, ఇప్పటికే ఆ విభాగం పరిశోధన ప్రారంభించినందున తమ విచారణ అవసరం లేదని ఆయన ఉపరాష్ట్రపతికి తెలిపారు.
More Stories
రతన్ టాటా మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం
ఆలయాల సొమ్ము సగం రేవంత్ ప్రభుత్వ ఖజానాకే
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత