ఏఏజీ సుధాకర్‌ రెడ్డిపై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి తీరుపై ఆంధ్ర ప్రదేశ్  హైకోర్టు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానానికి లేని ఉద్దేశాలు అంటగట్టే వ్యాఖ్యలు చేయడంతోపాటు గొంతు పెంచి బెదిరించేలా మాట్లాడారని ఆక్షేపించింది. ఎంపీ రఘురామరాజును ‘తక్షణం’ ఆస్పత్రికి తరలించాలన్న తమ ఉత్తర్వులు అమలు చేయలేదంటూ సీఐడీ అదనపు డీజీ సునీల్‌ కుమార్‌, మంగళగిరి సీఐడీ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోలపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

ఈనెల 19న హైకోర్టు సుమోటోగా దీనిని చేపట్టింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులలో జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ లలిత కుమారిలతో కూడిన ధర్మాసనం అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది.  ‘‘ప్రాథమికంగా చూస్తే అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ తీరును కోర్టు ధిక్కరణగా భావించి, చర్యలు తీసుకునేందుకు కచ్చితంగా అవకాశముంది. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా బార్‌ కౌన్సిల్‌కు రెఫర్‌ చేయవచ్చు కూడా! కానీ… ప్రస్తుతానికి దీనిని వదిలేస్తున్నాం” అని పేర్కొన్నది. 

మరోసారి ఇదే తీరు పునరావృతమైతే మాత్రం తగిన చర్యలు తీసుకునేందుకు ఎంత మాత్రం వెనుకాడేది లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ‘‘రఘురామరాజును ఆస్పత్రికి తరలించాల్సిందిగా 16వ తేదీ రాత్రి 11 గంటలకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక  ఆయనను ఆర్మీ ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ 17వ తేదీ మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేశారా అని ధర్మాసనం అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డిని ప్రశ్నించింది.

దీనిపై ఆయన ఆగ్రహం ప్రదర్శిస్తూ స్వరం పెంచి, బెదిరింపు ధోరణితో ఆర్టికల్‌ 226 ప్రకారం తప్పుడు, చట్టవిరుద్ధమైన ఆదేశాలను అమలుచేయాల్సిన అవసరమే లేదన్నారు. అయితే మేజిస్ట్రేట్‌ కోర్టు ఉత్తర్వు చట్టవిరుద్ధమైతే దీనిపై అప్పీలుకు వెళ్లాలి. ఈ నేపథ్యంలో… కోర్టు ఉత్తర్వులను అమలు చేశారా లేదా అని మళ్లీ ప్రశ్నించాం.

దీనిపై ఆయన స్పందిస్తూ  ‘‘రాత్రి 11 గంటలకు ఉత్తర్వుల కాపీ అందింది. అంటే  ఆ సమయంలో నేను వెళ్లి, జైలు తలుపులు తెరిపించి, రాత్రికి రాత్రి ఆయనను ఆస్పత్రికి తరలించాలా?’’ అని ప్రశ్నించారు.  రాత్రి అమలు చేయలేదు సరే, మరుసటి రోజు ఉదయం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించగా, నిందితుడు అప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారని, అందుకే హైకోర్టు ఉత్తర్వును అమలు చేయలేదని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ తెలిపారు.

మేజిస్ట్రేట్‌ కోర్టు ఉత్తర్వులు ఎందుకు చట్టవిరుద్ధం/మోసపూరితమో వినాల్సిందేనని, లేనిపక్షంలో తాను వాకౌట్‌ చేస్తానని బెదిరించేలా వాదనలు వినిపించారు. అంతేకాదు  ‘ఈ కేసుపై ప్రత్యేక ఆసక్తి ఎందుకో’ అంటూ కోర్టుకు తప్పుడు ఉద్దేశాలను ఆపాదిస్తూ, పెద్ద స్వరంతో ప్రశ్నించారు. ఈ సమయంలో… మాటలు అదుపులో ఉంచుకోవాలని ఆయనకు కోర్టు సూచించిందని ధర్మాసనం తన ఉత్తర్వులలో వివరించింది.

హైకోర్టు ఉత్తర్వులు అమలుచేయకపోవడానికి ఏఏజీ చెప్పిన ఈ కారణాలేవీ చెల్లుబాటు కావని ధర్మాసనం స్పష్టంచేసింది. ‘‘మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్లకుండా తమంతట తామే  అవి చట్టవిరుద్ధమని తేల్చలేరు. ఈ ఉత్తర్వులపై పైకోర్టు పక్కన పెట్టనంతకాలం… వాటిని అమలు చేయడం తప్ప మరో మార్గం లేదు’’ అని తేల్చిచెప్పింది. 

ఇక తనను సీఐడీ కస్టడీలో హింసించారని, నడవలేని పరిస్థితిలో ఉన్నానని నిందితుడు ఫిర్యాదు చేశారని, ఈ నేపథ్యంలోనే ‘తక్షణం’ (ఫోర్త్‌విత్‌) మేజిస్ట్రేట్‌ ఆదేశాలు అమలుచేయాలని ఆదేశించామని తెలిపింది. ఇక… సుప్రీంకోర్టులో బెయిలు పిటిషన్‌ వేశారన్న కారణంతో, నిందితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న హైకోర్టు ఆదేశాలు అమలుచేయలేదనడం ఏమాత్రం చెల్లదని స్పష్టం చేసింది.

ఇలా ఉండగా, సీఐడీ అదనపు డీజీ, మంగళగిరి సీఐడీ పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌… ఈ ముగ్గురూ కోర్టు ఉత్తర్వులను అమలుచేయడంలో విఫలమయ్యారని ప్రాథమికంగా స్పష్టమవుతోందని ధర్మాసనం పేర్కొంది. కోర్టు ఆదేశాలను వారు ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపింది.

మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు జోక్యం చేసుకుని తీరతామని హైకోర్టు స్పష్టంచేసింది. ‘‘నిందితుడిని కస్టడీలో హింసించారని, ఆయన నడవలేకపోయారని మాకు లేఖ అందింది. ఇలాంటి సమయంలో… మేం తలుపులు మూయలేం” అని స్పష్టం చేసింది.

మరీ ముఖ్యంగా గాయాలకు సంబంధించిన ఫొటోలను చూసిన తర్వాతే రిట్‌ పిటిషన్‌ను అనుమతించామని తెలిపింది. నిందితులకూ కొన్ని హక్కులుంటాయని, వాటిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని తెలుసుకోవాలి. ఇందులో ఏదైనా తేడా వస్తే న్యాయమైన హక్కులను కాపాడే వ్యవస్థగా హైకోర్టు జోక్యం చేసుకుని తీరుతుందని తేల్చి చెప్పింది.

నిందితుడు సామాన్యుడైనా, పార్లమెంటు సభ్యుడైనా కోర్టు ఎలాంటి వ్యత్యాసం చూపించదు. న్యాయం అసవరమైన ప్రతి ఒక్కరూ కోర్టు తలుపులు తెరవచ్చు. పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడటం కోర్టు బాధ్యత అని స్పష్టంచేసింది.