అమరిందర్ సింగ్- సిద్ధుల మధ్య ముదురుతున్న వివాదం 

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, మాజీ మధ్య నవజ్యోత్ సింగ్ సిద్దూల మధ్య వివాదం ముదురుతోంది. ఈ మధ్య చీటికిమాటికి సిద్ధూ సీఎంపై విమర్శలు ఎక్కుపెట్టడం పంజాబ్ రాజకీయాల్లో చర్చాంశమైంది.మరో తొమ్మిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో కాంగ్రెస్ కీలక నేతల మధ్య నెలకొన్న ఈ బహిరంగ సవాళ్లు, కుమ్ములాటలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపరుస్తున్నాయి.

సిద్ధూ తీరును సీఎం కెప్టెన్ అమరిందర్ ఇటీవల తీవ్రంగా ఎండగట్టారు. ఇది పూర్తిగా క్రమశిక్షణా రాహిత్యమే అని ఆయన దుయ్యబట్టారు. పనిలోపనిగా సిద్ధూ ఆప్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని ఓ మాట వదిలారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు భగ్గుమన్నాయి. సీఎం అమరీందర్ సింగ్‌ ప్రకటనపై మాజీ క్రికెటర్ సిద్దూ ఒంటి కాలితో లేచారు. తాను పార్టీ మారుతున్నట్లు సీఎం ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు.

‘‘నేను ఇతర పార్టీ నేతలతో భేటీ అయినట్లు నిరూపిస్తారా? ఈ తేదీ వరకూ నేనెవర్నీ పోస్ట్ అడగలేదు. చాలా మంది ఆహ్వానించి, కేబినెట్ బెర్త్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా నేను ముట్టలేదు. నేను కోరుకునేది పంజాబ్ శ్రేయస్సు మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో హైకమాండ్ జోక్యం చేసుకోవాల్సిందే. అప్పటి వరకూ వేచి చూడండి’’ అంటూ సిద్దూ ట్వీట్ చేశారు. 

ఆయన తన తాజా ట్వీట్ లో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధిలతో తాను దిగిన ఫొటోలు పెట్టారు. 2019లో స్థానిక సంస్థల పోర్ట్ ఫోలియో లాగేసుకున్నందుకు సిద్దూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇద్దరూ కీచులాడుకుంటూనే ఉన్నారు. 

సిద్దు విమర్శల పట్ల చాలాకాలం మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి ఈ మధ్య తన స్వస్థలం పాటియాల పట్ల సిద్దు దృష్టి సారిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఉద్దేశించి గత ఏప్రిల్ చివరిలో దమ్ముంటే వచ్చే ఎన్నికలలో అక్కడి నుండి పొతే చేయమని సవాల్ చేశారు. అక్కడి నుండి పొతే చేస్తే డిపాజిట్ కోల్పోతారని ఎద్దేవా చేశారు. 

పైగా, సిద్దును ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయబోతున్నారని వస్తున్న కథనాలను కొట్టిపారవేస్తూ ప్రస్తుత అధ్యక్షుడు సునీల్ ఙాఖర్ బాగా పనిచేస్తుండగా ఆయనను మార్చవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.  ఆ మధ్య ఇద్దరి మధ్య రాజీకి ప్రయత్నాలు జరిగాయి. గత మార్చిలో ఇద్దరూ కలుసుకున్నారు. సిద్ధూ మళ్లీ మంత్రివర్గంలో చేరొచ్చన్నట్టుగా అమరిందర్ సూచించారు. కానీ సయోధ్యకు బదులుగా ఇద్దరి మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో దూరం పెరిగింది.