కమల్‌నాథ్ వ్యాఖ్యలు దేశాన్ని అవమానించడమే

కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌ దేశానికి వ్యతిరేకంగా ప్రతికూల రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిణామాలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎందుకు మౌనంగా చూస్తున్నారని ఓ ట్వీట్‌లో ప్రశ్నించారు.

కొత్త కరోనా వైరస్ వేరియంట్‌ను ‘ఇండియన్ కరోనా’ అని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అంటున్నారని, ఈ వ్యాఖ్యలపై సోనియా గాంధీ ఎందుకు  మౌనంగా ఉన్నారని జవదేకర్  ప్రశ్నించారు. కమల్‌నాథ్ వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని సోనియాను నిలదీశారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ను ఇండియన్ వేరియంట్ అని కొందరు అంటున్నారని, కమల్‌నాథ్ ఓ అడుగు ముందుకు వేసి ‘ఇండియన్ కరోనా’ అంటున్నారని దుయ్యబట్టారు. ‘నా భారత దేశ కోవిడ్’ అని మన దేశాన్ని చూడాలని అన్నారని చెప్పారు. 

ఈ మాటలు బాగా ప్రచారమవుతున్నప్పటికీ కమల్‌నాథ్ స్పందించడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ‘నా భారత దేశ కోవిడ్’ అని అనడం భారత దేశాన్ని అవమానించడమేనని ఆరోపించారు. ఇది భారత దేశానికి అవమానకరమని కేంద్ర మంత్రి మండిపడ్డారు. 

ఇత‌ర కాంగ్రెస్ నేత‌లు ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లే చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.కాంగ్రెస్ నేత‌ల వ్యాఖ్య‌లు దేశానికి అవ‌మాన‌క‌ర‌మే కాకుండా క‌రోనా వైర‌స్ వ్య‌తిరేక పోరాటాన్ని బ‌ల‌హీన‌ప‌రిచేలా ఉన్నాయ‌ని ఆయన పేర్కొన్నారు. భార‌త్ బ‌యోటెక్ రూపొందించిన కొవ్యాక్సిన్ ను బీజేపీ వ్యాక్సిన్ గా కాంగ్రెస్ పార్టీ పిల‌వ‌డాన్ని కేంద్ర మంత్రి త‌ప్పుప‌ట్టారు. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటాన్ని కాంగ్రెస్ బలహీనపరుస్తోందని జవదేకర్  ఆరోపించారు.

భారత దేశం పేరు, ప్రతిష్ఠలను కాంగ్రెస్ దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించడం లేదని విమర్శించారు.  ప్రతికూలత నిండిన రాజకీయాలకు ఎందుకు పాల్పడుతున్నారో సోనియా గాంధీ చెప్పాలని కేంద్ర మంత్రి నిలదీశారు. కమల్‌నాథ్ వ్యాఖ్యలను ఇప్పటికీ ఎందుకు ఖండించడం లేదో ఆమె చెప్పాలని డిమాండ్ చేశారు.

కోవిడ్-19 వేరియంట్లను దేశాల పేర్లతో పిలవడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టంగా చెప్పినప్పటికీ, బీ.1.617 వేరియంట్‌ను ఇండియన్ వేరియంట్ అని చాలా మంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సోనియా గాంధీ రాసిన లేఖను జవదేకర్ ప్రస్తావిస్తూ, రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను సరఫరా చేయడంతోపాటు బ్లాక్ ఫంగస్ వ్యాధికి చికిత్స చేయడంలో భారత ప్రభుత్వం చురుగ్గా ఉందని చెప్పారు.