భార‌త్‌లో 85 కోట్ల స్పుత్నిక్‌ టీకాల‌ ఉత్పత్తి  

భార‌త్‌లో మొత్తం 85 కోట్ల స్పుత్నిక్‌ టీకాల‌ను ఉత్ప‌త్తి చేయనున్న‌ట్లు రష్యాలోని సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో ఉన్న
భారత్ దౌత్యాధికారి డి బాలా వెంట‌క‌టేశ్ వ‌ర్మ‌ తెలిపారు. భారత్ లో స్సుత్నిక్ టీకాల ఉత్ప‌త్తి ఆగష్టులో ప్రారంభం అవుతుందని తెలుపుతూ, స్పుత్నిక్ ఉత్పలాటి చేస్తున్న టీకాల్లో 70 శాతం వ‌ర‌కు ఇండియాలోనే ఉత్ప‌త్తి అవుతాయ‌ని పేర్కొన్నారు. 
 
భార‌త్‌లో మూడు ద‌శ‌ల్లో స్పుత్నిక్ టీకాల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. తొలుత ర‌ష్యా నుంచి టీకాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని, అది ఇప్ప‌టికే ప్రారంభం  అయ్యింద‌ని గుర్తు చేశారు. ఇక బ‌ల్క్‌లో భారత్ కు  ఆర్డీఐఎఫ్ టీకాల‌ను పంపుతుంద‌ని, ఆ బల్ టీకాల‌ను బాటిళ్ల‌లో నింపాల్సి ఉంటుంద‌ని తెలిపారు.
 
ఇక మూడ‌వ ద‌శ‌లో ర‌ష్యా త‌న టెక్నాల‌జీని భారత్ లోని కంపెనీకి బ‌దిలీ చేస్తుంద‌ని చెప్పారు. ఆ త‌ర్వాతే హైద‌రాబాద్‌లోని రెడ్డి ల్యాబ్స్ పూర్తి స్థాయిలో టీకాల‌ను ఉత్ప‌త్తి చేస్తుంద‌ని పేర్కొన్నారు. అయితే మూడు ద‌శ‌లు క‌లిపి భారత్లో  మొత్తం 85 కోట్ల స్పుత్నిక్ టీకాలు ఉత్ప‌త్తి అవుతాయ‌ని వివరించారు. 
 
ఇప్ప‌టికే భారత్కు ఓసారి ల‌క్ష‌న్న‌ర‌, ఆ త‌ర్వాత 60 వేల స్పుత్నిక్ టీకాల‌ను పంపించిన‌ట్లు వర్మ తెలిపారు. మే నెల చివ‌రి నాటికి మొత్తం మూడు కోట్ల స్పుత్నిక్ టీకాల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం పంపిన టీకాల‌ను భారత్లోనే బాటిళ్ల‌లో నింపనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇక జూన్ నెల‌లో టీకా డోసుల సంఖ్య‌ను అయిదు కోట్ల‌కు పెంచ‌నున్న‌ట్లు తెలిపారు.
 
కాగా,  స్పుత్నిక్ లైట్ టీకాల‌కు ఇంకా భార‌త్ నుంచి అనుమ‌తి రాలేద‌ని, రెండు దేశాల మ‌ధ్య సింగిల్ డోసు స్పుత్నిక్ లైట్ టీకా స‌హ‌కారం కూడా ఉంటుంద‌ని వెంక‌టేశ్ వ‌ర్మ తెలిపారు.