ప్రజారోగ్యంకు కేసీఆర్ ప్రభుత్వంలో నిధులు నిల్

వరుసగా సికింద్రాబాద్, వరంగల్ లలో రెండు ప్రభుత్వ ఆసుపత్రులను కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత మొదటిసారి సందర్శించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రజారోగ్యానికి భరోసా కల్పిస్తూ ఎన్నో మాటలు చెబుతూ వచ్చారు. కరోనా కట్టడికి నిధుల సమస్య లేదని సంవత్సర కాలంగా చెబుతూ వస్తున్నారు. 
 
అయితే వాస్తవానికి కరోనా కాలంలో ప్రజారోగ్యానికి నిధులను పెంచవలసింది పోయి, గాథలోకన్నా తక్కువగా కేటాయిస్తూ వస్తున్నారు. ‘‘వెయ్యి కోట్లు ఖర్చు పెట్టయినా సరే…  అసలు కరోనాను  రానే రానియ్యం..’’ అని రాష్ట్రంలో నిరుడు కరోనా ప్రవేశించిన కొత్తలో అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ కనీసం రూ 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టడం లేదు.
 
ఇరిగేషన్​, రోడ్లు, పోలీసింగ్, విద్య… ఈ వరుస చూస్తే నిధుల కేటాయింపుల ప్రాధాన్యతలలో ప్రజారోగ్యానికి 12వ స్థానం కల్పిస్తున్నారు. ఇరిగేషన్​ ప్రాజెక్టులకు  రూ. 20 వేల కోట్లు, రైతుబంధు, రైతుల పంట రుణాల మాఫీ, వడ్డీ లేని రుణాలకు రూ. 20 వేల కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ. 12 వేల కోట్లు, డబుల్​ బెడ్రూం ఇండ్లకు రూ. 5 వేల కోట్లు ప్రభుత్వం నిరుడు ఖర్చు చేసింది.
ఈ ఏడాది కూడా అవే రిపీట్​ చేసింది. ఈసారి బడ్జెట్​లో సెక్రటేరియట్​ కొత్త బిల్డింగ్​కు రూ. 610 కోట్లు, రీజనల్​ రింగ్​ రోడ్​కు రూ. 750 కోట్లు, జిల్లాల్లో పోలీసింగ్​కు రూ. 3,000 కోట్లు, రోడ్లు, బ్రిడ్జీలకు రూ. 4,000 కోట్లు, చెక్​ డ్యామ్​లకు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా​ పెట్టుకుంది.

అయితే ప్రజారోగ్యానికి గత ఏడాదికన్నా ఈ ఏడాది తక్కువగా నిధులు కేటాయించారు. నిరుడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తం రూ. 1.66 లక్షల కోట్లలో ఆరోగ్యంకు ఖర్చు చేసింది రూ. 5,600 కోట్లు దాట లేదు. అంటే మొత్తం ఖర్చులో మూడు శాతం కూడా మించలేదు. ఈ ఏడాది మొత్తం 2.30 లక్షల కోట్ల బడ్జెట్​లో  ఆరోగ్యంకు 2.5 శాతమే కేటాయించారు.

ఆరోగ్యంకు కేటాయించిన రూ. 5,868 కోట్లలో జీతాలు, నిర్వహణ ఖర్చులకే సగానికిపైగా రూ.3,800 కోట్లు అవసరం కాగలదు. మిగతా రెండు వేల కోట్లలో కేంద్రం అమలు చేసే నేషనల్​ హెల్త్ మిషన్​ స్కీమ్​కు రాష్ట్రం వాటా రూ. వెయ్యి కోట్లు. ఆరోగ్య శ్రీ బిల్లులు, ఈహెచ్​ఎస్​ కేటాయింపులు పోతే మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసే నిధులు అరకొరే ఉంటాయి.
మందులు, సర్జికల్ ఎక్విప్​మెంట్​ కొనుగోళ్లకు నిధుల్లో కోత పెట్టింది. అందుకే కరోనా సమయంలో ఇంజక్షన్లు, ఆక్సిజన్​ సిలిండర్లు, అన్నింటికి కొరత ఏర్పడింది. సర్కారీ​ హాస్పిటళ్లలో కరోనా చికిత్సకు సరిపడే సదుపాయాలు, మందులు​ అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులు పెరిగిపోయాయి. నిధుల్లేక ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. కరోనా చికిత్సకు ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడంతో పేదలు వైద్యసేవలు అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రైవేటు హాస్పిటళ్లలో చేరిన వాళ్లు ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు. అవి కూడా సరిపోనివాళ్లు అప్పులపాలవుతున్నారు. 
కరోనా విలయంలో ప్రజలను ఆదుకునేందుకు అత్యవసరమైన ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు, మందులు​, సర్జికల్​ పరికరాల కొనుగోలు, అంబులెన్స్​ సేవలను సర్కారు మరిచిపోయింది. కొత్త సెక్రటేరియట్​ బిల్డింగ్​లకు రూ. 61‌0 కోట్లు రిలీజ్​ చేసిన ప్రభుత్వం కొవిడ్​ స్పెషాలిటీ హాస్పిటల్​గా చెప్పుకుంటున్న టిమ్స్​కు మాత్రం రూ.  27 కోట్లే ఇచ్చింది.
ఫస్ట్ వేవ్​ కరోనా విజృంభించిన టైమ్​లో నిమ్స్ కంటే స్టాండర్డ్ హాస్పిటల్​గా, కొత్తగా గచ్చిబౌలిలో టిమ్స్​ హాస్పిటల్​ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కార్పొరేట్​ హాస్పిటల్​కు తీసిపోని విధంగా అద్భుతంగా టిమ్స్​లో వైద్య సదుపాయాలు ఉంటాయన్నారు.
1,500 బెడ్ల కెపాసిటీతో ఏర్పాటు చేస్తామన్న ఈ హాస్పిటల్​కు నిరుడు రూ. 25 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం, ఈసారి బడ్జెట్​లో తూతూ మంత్రంగా రూ. 2 కోట్లు ఇచ్చింది. వంద కోట్లతో టిమ్స్​ను అద్భుతంగా తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏ మూలకు సరిపోతాయని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.