ఆనందయ్య మందులో హానికర పదార్థాలు లేవు

ఆనందయ్య మందులో హానికర పదార్థాలు లేవు
ఆనందయ్య ఆయుర్వేద ఔషధంపై ఏపీ ఆయుష్ కమిషన్ పరిశీలన ముగిసింది. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య మందును తయారు చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో మందు తయారీకి వినియోగించే వస్తువులు అన్నీ శాస్త్రబద్ధమైనవేనని, వాటివల్ల ఎలాంటి చెడు ప్రభావం లేదని ఆయుష్‌ నిర్ధారించింది. ఈ మేరకు ప్రాథమిక నివేదిక ఇచ్చింది. 
 
ఆనందయ్య ఎలాంటి హానికర పదాదార్థాలను వాడటం లేదని ఏపీ ఆయూష్ కమిషనర్ రాములు వెల్లడించారు. మందు తయారీలో హానికర పదార్థాలు లేవని స్పష్టం చేశారు. అయితే ఆనందయ్య మందును నాటుమందుగానే పరిగణిస్తామని రాములు తెలిపారు. కళ్లలో వేసే డ్రాప్స్‌లో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారని స్పష్టం చేశారు. 
 
 మందు తయారీకి వినియోగించే దినుసులను పరిశీలించడంతోపాటు మందు విని యోగించిన వారి వివరాలు తెలుసుకున్నారు. మందును వాడిన 500 మందితో మాట్లాడి వారిచ్చిన వివరాలను నివేదికలో పొందుపర్చనున్నారు.
 
అయితే ఆనందయ్య మందు రోగులపై పనిచేస్తుందా లేదా అనేది ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుందని రాములు వెల్లడించారు. డాక్టర్ల బృందం పరిశీలన అనంతరం తమ నివేదికను సీసీఆర్ఎఎస్‌‌కు పంపుతుందుని పేర్కొన్నారు. అన్ని నివేదికలు వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం వస్తుందని రాములు వెల్లడించారు. 
 
కాగా, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) బృందం ఈ నెల 24న  కృష్ణపట్నానికి వెళ్లనుంది. కరోనాకు ఇక్కడి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందును పరీక్షించనుంది. ఈ బృందం ఆయుర్వేద మందు శాస్త్రీయతను పరీక్షించిన తర్వాతే తిరిగి పంపిణీ జరిగే అవకాశం ఉంది.
 
ఇలా ఉండగా, కరోనా నియంత్రణకు ఆయుర్వేద మందును తయారుచేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దృష్టి సారించింది. అందులో భాగంగా ఆనందయ్య తయారు చేస్తున్న మందుపై ఆసక్తి చూపుతోంది. ఐసీఎంఆర్‌ నివేదిక అనుకూలంగా వస్తే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఆయుర్వేద మందును ప్రపంచానికి అందించాలని భావిస్తోంది.
శేషాచలం అడవుల్లో అపార ఔషధ గుణాలు కలిగిన 1,300 మొక్కల జాతులు ఉన్నాయి.  వీటిలో అపార ఔషధ గుణాలున్న పెర్రూత, తంబ జాలరీ, కొండ సామ్రాణి, అడవి నీలిమందు, ఎరచ్రందనం, అడవి కంది, అడవి బిల్లు, తెల్ల కరక, మోగి, అడవి కొత్తివీుర, చిన్న పూలతుమ్మి లాంటి 11 రకాల మొక్కలకు శేషాచలం ప్రత్యేకం.