కరోనాను కూడా రాజకీయ చేస్తున్న జగన్ 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనాను సీరియస్‌గా తీసుకోలేదని, పైగా కరోనాను రాజకీయం చేస్తున్నారని బీజేపీ సీనియర్నే త, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. 

రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో విఫలమైన వైసీపీ ప్రభుత్వాన్ని నిరసిస్తూరాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు అందుకొని బిజెపి కార్యకర్తలు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఎవరి ఇంటి దగ్గర వారే   “ద ర్నా” చేసారు. 

ఈ సందర్భంగా కన్నా గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని సీఎంల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందుగానే హెచ్చరించినా జగన్ ఏమాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బెడ్స్ ఏర్పాటు, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావటం వంటి వాటిపై సీఎం కనీసం సమీక్ష కూడా  నిర్వహించలేదని మండిపడ్డారు. 

సెకండ్ వేవ్‌లో మరణాలు ఎక్కువగా ఉన్నాయని, వ్యాక్సిన్ తొందరగా తీసుకురావాలని మోదీ రూ. 35,000 కోట్లు కేంద్ర బడ్జెట్‌ కేటాయించారని కన్నా గుర్తు చేశారు. పైగా, రాష్ట్రంలో వైసీపీ మద్దతు లేని ఆసుపత్రులను జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నదని  కన్నా ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా 5,000 పీఎం కెర్స్  వెంటిలేటర్లను ఇచ్చినా, వాటినీ కూడా పూర్తి స్ధాయిలో వినియోగించడం లేదని కన్నా చెప్పారు. ముఖ్యమంత్రి  కూడా కొన్ని ఆసుపత్రిలలో సందర్శిస్తే ప్రజలకు మనోధైర్యం వస్తుందని సూచించారు. 

ఆక్సిజన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని కన్నా దుయ్యబట్టారు. రెమిడెసివర్ ఇంజక్షన్లను అందుబాటులోకి తీసుకురావటానికి చేయాల్సినంత ప్రయత్నం ప్రభుత్వం చేయలేదని విమర్శించారు.బ్లాక్ మార్కెట్ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. 

 వైద్య రంగంలో మౌళిక సదుపాయాలు కల్పించాల్సిన సమయంలో కూడా చర్చిల  నిర్మాణం కోసం టెండర్లు పిలిచారని విస్మయం వ్యక్తం చేశారు.   రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని, ఎంపీ రఘురామ విషయంలో తేలిపోయిందని కన్నా తీవ్రంగా విమర్శించారు.  ఎంపీ విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ఇవ్వొద్దని సిఎం లేఖ వ్రాయడం పట్ల విస్మయం వ్యక్తం చేసారు. మౌళికసదుపాయాలు కల్పన, వ్యాక్సిన్ తీసుకురావటంపై సీఎం శ్రద్ద పెట్టాలని సూచించారు. ఏపీకి ఎక్కువ వ్యాక్సిన్ ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర  బీజేపీ కూడా మద్దతిస్తోందని కన్నా స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని కన్నా లక్ష్మినారాయణ జగన్ కు కన్నా హితవు చెప్పారు.