ఏపీ అసెంబ్లీలో మొదటగా ఒకేరోజు బడ్జెట్ సమావేశాలు!

పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు కీలకమైనవి. సుదీర్ఘంగా, అన్ని అంశాలపై సవివరమైన చర్చలకు అవకాశం కల్పించేవి. అయితే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో మొదటిసారిగా ఒకేరోజు అసెంబ్లీ సమావేశాలు గురువారం జరుగబోతున్నాయి. కరోనా విస్తరణ నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఒక్కరోజుకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. గురువారం ఉదయం జరగనున్న శాసనసభ వ్యవహారాల కమిటీ (బిఎసి) సమావేశంలో ఈ మేరకు అధికారికంగా ప్రకటించనున్నారు. 

అదే జరిగితే, గవర్నర్‌ ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, చర్చ, ఆమోదం వంటి కీలక అంశాలన్నీ ఆరోజే ముగియనున్నాయి. వీటితో పాటు ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం కూడా తెలపాల్సిఉంది. శాసనసభ ప్రారంభానికి ముందే రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగిన బడ్జెట్‌ ప్రతిపాదనలను లాంఛనంగా ఆమోదించాల్సిఉంది. ఇన్ని కీలకాంశాలు ఒక్క రోజులోనే జరగనుండటం శాసన సభ చరిత్రలో ఇదే మొదటిసారి. 

కరోనా వ్యాప్తి కారణంగా గతంలో మాదిరి సమావేశాల నిర్వహణ సాధ్యం కాదని, మరోవైపు బడ్జెట్‌ ప్రతిపాదనలను శాసనసభలో ఆమోదించుకోవాల్సిన రాజ్యాంగ బాధ్యత ఉండటం ఈ నిర్ణయానికి కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, తూతూమంత్రంగా ఒక్కరోజు జరిగే సమావేశం వల్ల ప్రయోజనం లేదని, దీనిని బహిష్కరిస్తున్నామని టిడిపి ప్రకటించింది. 

మార్చి నెలలో 9 వేల కరోనా కేసులున్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయలేమని చెప్పిన ముఖ్యమంత్రి, ఇప్పుడు 2.20 లక్షల పాజిటివ్‌ కేసులు ఉన్న సమయంలో ఎలా సమావేశాలను ఏర్పాటు చేస్తారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు   ప్రశ్నించారు. 

రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌ నుండే ఉభయసభల నుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన ప్రసంగం ప్రారంభం కానుందని తెలుస్తున్నది. అంతకు అరగంటముందు ఉదయం 8.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో క్యాబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే బడ్జెట్‌ ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించనుంది. 

గవర్నర్‌ ప్రసంగం అనంతరం బిజినెస్‌ ఎడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించి సమావేశ నిర్వహణపై అధికారికంగా నిర్ణయం తీసుకుంటున్నారు. సాధారణ బడ్జెట్‌తోపాటు వ్యవసాయ బడ్జెట్‌నూ విడిగా ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మండలిలో మంత్రి బొత్సనారాయణ బడ్జెట్‌ ప్రవేశపెటనున్నట్లు తెలిసింది. 

కరోనా కారణంగా గతంనుండి వస్తున్న అనేక సంప్రదాయాలకు, ఆనవాయితీలకు తాజా సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చెల్లుచీటి ఇవ్వనుంది. గవర్నర్‌ ప్రసంగం తరువాత సాధారణంగా సభను వాయిదా వేసి, ఆ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కనీసం రెండు, మూడు రోజులు చర్చించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఆ సాంప్రదాయాన్ని పాటించడం లేదు. 

అదే విధంగా సిట్టింగ్‌ సభ్యులకు సంతాపం తెలిపిన తరువాత ఆ రోజు కార్యాక్రమాలకు సభ దూరంగా ఉండటం ఆనవాయితి. ఈ సారి దానిని పట్టించుకోవడం లేదు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థికమంత్రి ప్రసంగం ముగియగానే సభను వాయిదా వేయడంతో పాటు కనీసం రెండు, మూడు రోజులు సెలవు ఇవ్వడం కూడా సాంప్రదాయంగా ఉంది. 

బడ్జెట్‌ను శాసనసభ్యులు అధ్యయనం చేయడానికి ఈ సమయాన్ని కేటాయించేవారు. ఈ సారి మాత్రం బడ్జెట్‌ పెట్టడం, ఆ వెంటనే చర్చను నిర్వహించి, ఆమోదింపచేసుకోవడం జరగనుంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనివార్యమయ్యే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఎక్కువకాలం ఒకేచోట ఉండే అవకాశాలు లేకపోవడం, ఎసి హాలు కావడం తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. మండలి సభ్యుల్లో ఎక్కువమంది ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, హైరిస్కు కేటగిరీలో ఉన్నారని, వారి ఆరోగ్య రక్షణ కూడా చూడాల్సి ఉందని చెప్పారు.