ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం ఆధీనంలోకి.. హైకోర్టు సూచన

కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొనే విషయాన్ని పరిశీలించాలని  ఆంధ్ర ప్రదేశ్  హైకోర్టు సూచించింది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన తరువాత కేసుల సంఖ్య పెరిగాయా, తగ్గాయా అని ఆరా తీసింది. ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రుల్లో శానిటైజేషన్‌ సక్రమంగా చేపట్టడం లేదని, రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొంటూ సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించింది. 

ఈ విపత్కర పరిస్థితుల్లో మెడికల్‌ సిబ్బంది కొరతను అధిగమించేందుకు నర్సింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులను ఉపయోగించుకోవాలని సూచించింది. కొవిడ్‌ బాధితులు, వారి బంధువులు బెడ్ల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుండగానే వారి ప్రాణాలు పోతున్నాయని, ఖాళీ బెడ్ల వివరాలు తెలిపేలా సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. 

వ్యాక్సినేషన్‌ సెంటర్ల దగ్గర ప్రజలు గుంపులుగా చేరకుండా, రద్దీ తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది. సీనియర్‌ సిటిజన్స్‌తో పాటు వికలాంగులకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలంది. చికిత్స పొందుతున్న కరోనా బాధితుల ఆరోగ్యపరిస్థితిని బంధువులకు తెలియపర్చేందుకు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.

ప్రైవేటు అంబులెన్స్‌ల దోపిడీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా కట్టడి, చికిత్స విషయంలో పలు అంశాలు లేవనెత్తిన ధర్మాసనం.. పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. 

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది.  ఆక్సిజన్‌ అందక జరిగిన మరణాలకు పరిహారం ఇప్పించడంతో పాటు కొవిడ్‌ చికిత్సలో ఎదురవుతున్న ఇబ్బందులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాదులు రాసిన 3 లేఖలను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా స్వీకరించింది.