కేసీఆర్ ఎందుకు వ్యాక్సిన్ తీసుకోవడం లేదు?

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వ్యాక్సిన్ తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలని  బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ డిమాండ్ చేశారు. అంతేకాదు, కేసీఆర్ కరోనా నివారణకు వ్యాక్సిన్ తీసుకోవాలని కూడా ప్రజలకు పిలుపు ఇవ్వడం లేదని గుర్తు చేశారు. అంత నిర్లక్ష్యం ఎందుకో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. 

కరోనాపై కేటీఆర్ తో నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రజలను దోచుకోవడానికే ఉంద‌ని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులులేక కరోనా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని, ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతతో ఉన్న సిబ్బందే సేవలు చేసే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కేటీఆర్ తో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఆస్పత్రులను ఎందుకు సందర్శించడం లేదని ప్ర‌శ్నించారు. వసతులను ఎందుకు మెరుగుపరచడం లేద‌ని నిలదీసేరు.

కేంద్ర ప్రభుత్వం 61 లక్షల  41 వేల 40 డోస్ ల వ్యాక్సిన్ ను రాష్ట్రానికి ఇచ్చిందని,   కానీ..  రాష్ట్ర ప్రభుత్వం 54 లక్షల 47 వేల 805 డోస్ లను మాత్రమే ప్రజలకు ఇచ్చినట్టుగా లెక్కలు చెప్తున్నాయని తెలిపారు. మిగతా ఆరు లక్షల తొంభై మూడు వేల డోసులు ఎక్కడున్నాయని ప్ర‌శ్నించారు. ప్రజలకు వ్యాక్సిన్ ను ఎందుకు నిలిపివేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల‌ని కోరారు. 

కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, రైతులకు ఇబ్బందులు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలో బీజేపీ ఆందోళనలు చేపడుతుందని సంజయ్  తెలిపారు. కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్లను ఉపయోగించుకోకుండా,  తుప్పు పట్టిన తర్వాత కేంద్రాన్ని బదనాం చేయడం మంచిది కాదని హితవు చెప్పారు. 

టెస్ట్ లను, కేసులను,  మరణాలను తక్కువ చేసి చూపించి, రాష్ట్రంలో కరోనా లేదని చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆరోపించారు.  ప్రైవేట్ ఆస్పత్రులను కరోనా ట్రీట్మెంట్ ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలని స్పష్టం చేశారు.  కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల నుంచి దుర్మార్గంగా దోచుకుంటే.. మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు మాత్రం కరోనా పేషెంట్ లకు సేవలందిస్తున్నారని తెలిపారు.