కరొనను ఆరోగ్యశ్రీలో చేర్చం.. కేసీఆర్ సంకేతం 

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురాబోమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పరోక్షంగా తేల్చి చెప్పారు. ‘ప్రైవేట్ హాస్పిటల్స్‌‌లో కరోనా చికిత్స  కోసం11 నెలల క్రితమే జీవో జారీ చేశాం. మహారాష్ట్ర, యూపీ, కేరళ, తమినాడు రాష్ట్రాల్లోనూ ఇదే తరహా రూల్స్ అమలు చేస్తున్నారు. అక్కడ రోగులు హాస్పిటల్ బిల్లులు కట్టుకుంటున్నారు’ అని సోమవారం రాత్రి సీఎంవో విడుదల చేసిన ప్రెస్‌‌ నోట్‌‌లో పేర్కొన్నారు. 

కరోనా చికిత్స కోసం ప్రభుత్వ దవాఖాన్లలో అన్ని ఏర్పాట్లు చేశామని, ఆక్సిజన్, మందులు సహా దేనికి కొరతలేదని  స్పష్టం చేశారు. ప్రైవేట్‌‌కు వెళ్లి డబ్బులు వృద్ధ  చేసుకోవద్దని సీఎం సూచించారు. సోమవారం ప్రగతి భవన్ లో కరోనాపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్ల సరఫరా కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని అధికారులకు సూచించారు. 

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వ్యాక్సినేషన్ కోటా విషయంలో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి 57,30,220 డోసుల వ్యాక్సిన్ మాత్రమే వచ్చిందని, కొవాగ్జిన్, కొవిషీల్డ్ కలిపి ప్రస్తుతం1,86,780 డోసుల స్టాకు ఉందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో 48 సర్కార్ దవాఖాన్లలో 324 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి కెపాసిటీతో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.  వీటికి అదనంగా హైదరాబాద్ లో 100 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఆక్సిజన్ కోసం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడే పరిస్థితి ఉండొద్దని హితవు చెప్పారు.  

ప్రభుత్వ దవాఖాన్లలో 6,926 బెడ్లు ఖాళీగా ఉన్నాయని సీఎం చెప్పారు. వీటిలో 2,253 ఆక్సిజన్, 533 ఐసీయూ, 4,140 జనరల్ బెడ్స్ ఖాళీగా ఉన్నాయన్నారు. ట్రీట్​మెంట్, భోజనం, మందుల వంటివన్నీ ఉచితంగానే కల్పిస్తున్నందున పేదలంతా సర్కార్ దవాఖాన్లలోనే చేరాలని కోరారు. కరోనా రోగులకు  బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకుతున్నందున అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్​లో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. వీటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలూ వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న  మెడికల్ కాలేజీల్లో నర్సింగ్ కాలేజీలు లేని చోట్ల వాటిని మంజూరు చేయాలని సూచించారు. 

ప్రభుత్వ దవాఖాన్లలో మెరుగైన చికిత్స, మందులు అందించడం కోసం సిద్దిపేట, వనపర్తి,  మహబూబాబాద్, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, సూర్యాపేట, భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, వికారాబాద్, గద్వాల జిల్లా కేంద్రాల్లో రీజనల్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. 

ఆస్పత్రులకు వేగంగా మందులు అందించేందుకు వాహనాలను సిద్ధం చేయాలని చెప్పారు. వికారాబాద్ అనంతగిరిలోని 200 బెడ్ల ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మార్చాలని, సింగరేణి, ఆర్టీసీ, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, రైల్వే, ఆర్మీ, ఈఎస్ఐ సహా అన్ని ఆస్పత్రులను కొవిడ్ దవాఖాన్లుగా వాడుకోవాలని ఆదేశించారు.