గరీబోళ్ల కోసం రేపు తెలంగాణ బీజేపీ దీక్ష  

తెలంగాణాలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చాలన్న డిమాండ్‌తో రేపు జరిగే “గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష”ను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  పిలుపునిచ్చారు. ఎవరింట్లో వాళ్లు కొవిడ్, లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి దీక్ష చేయాలని ఆమె కోరారు. 

మీడియా, సోషల్ మీడియా, వర్చువల్ మీడియా ద్వారా దీక్షను విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామని  డీ.కే.అరుణ పేర్కొన్నారు.దేశంలో కరోనా కట్టడికి కేంద్రం అహర్నిశలు శ్రమిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు అడిగిందే తడవుగా ఎలాంటి సాయం చేయడానికైనా కేంద్రం సిద్ధంగా ఉందని ఆమె చెప్పారు.

కరోనా కేసులు, మరణాలు విషయంలో తెలంగాణ తప్పుడు లెక్కలు చూపుతోందని అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా  ఈ విషయంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆక్సీజన్, రెమ్‌డెసివిర్, వెంటిలేటర్లను భారీగా అందజేసిందని ఆమె గుర్తు చేశారు. పేదలకు కొవిడ్ చికిత్స భారం నుంచి రూ.5 లక్షల వరకు  అందించే ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆమె మండిపడ్డారు.

 రాష్ట్రంలో ఆయూష్మాన్ భారత్‌ను అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలన్న డిమాండ్‌తో రేపు జరగబోతున్న “గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష” ను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ, బిజెపి నేత విజయశాంతి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని ఆమె మండిపడ్డారు.

రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే కరోనా చికిత్సలో రూ.5లక్షల వరకు కేంద్రమే చెల్లిస్తుందని ఆమె తెలిపారు. ఈ స్కీంలో చేరనందుకు రాష్ట్రం రూ.200 కోట్లు కోల్పోయిందని విజయశాంతి పెక్రోన్నారు. తన బంధువులు, అనుచరుల హాస్పిటళ్లకు రోజూ కోట్లలో వస్తున్న ఆదాయాన్ని కాపాడేందుకే కేసీఆర్ ఆయుష్మాన్ భారత్‌ను, ఆరోగ్యశ్రీని అమలు చేయట్లేదా? అని ఆమె ప్రశ్నించారు.

కాగా, లక్షల మంది కరోనా బాధిత కుటుంబాలు హాస్పిటల్ ఫీజులు చెల్లించలేక ఆర్థికంగా కుదేలయ్యాయని బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా చికిత్సలో రూ.5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక పోవడంతో రాష్ట్ర ప్రజలు అప్పుల పాలవుతున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని కూడా అమలు చేయడం లేదని పేర్కొన్నారు. 

సర్కార్ హాస్పిటళ్లకు పోలేక, ప్రైవేటు హాస్పిటల్ ఫీజులు చెల్లించలేక కరోనా బాధితులు ప్రాణాలు వదులుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్యశ్రీ లో కోవిడ్ చికిత్సను చేర్చాలన్న డిమాండ్‌తో రేపు రాష్ట్ర బీజేపీ చేపట్టబోయే “గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష” ను విజయవంతం చేయాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు.